Friday, 25 November 2016

 శ్రీ శివచాలీసా

నిత్య పఠనీయం * * * శ్రీ శివచాలీసా * * * ( తెలుగు )
+++ +++ +++ +++ +++ +++ +++
శ్రీ శివశంకర గిరిజా రమణా ! పార్వతి నాథా నమో నమ:
భూతనాధుడూ దయాసాగరుడు - భస్మధారుడూ కైలాసవాసుడు " శ్రీ శివ "

బాలచంద్రునీ శిరమున దాలిచి - జటాజూటముల గంగను నిలిపి
పులిచర్మమునే పీతాంబరముగ -రుద్రరూపమున వెలుగొందితివీ
కాలసర్పము కంఠమాలగా-విభూతిరేఖలు అలంకారముగ
త్రిశూలఢమరుక చేతపట్టితివి - ఫాలనేత్రమూ ప్రజ్వరిల్లగా " శ్రీ శివ "
నెమలివాహనుడు,గజాననుండూ-నీవెంట ఉందురు నిను సేవింతురు
నీ భారమును మోయుటకొరకు -ముందరయుండును నందివాహనము
నృత్యరీతులకు పాదఘటనకూ -అదురును అవనీ ప్రళయకాలమని
పంచభూతములు ఉద్వేగపడునూ -శివతాండమును కనులార జూడగ " శ్రీ శివ "
కారణాంతమున భగీరధుడు-నిను మెప్పించగ తపమాచరించెను
గంగను భువిపై ప్రవహింపజేసీ - శిలలను శ్యామల మొనరించినావు
దేవతలందరు భయపడిపోయిరి - తారకాసురునితో యుద్దముచేయగ
అభయమునిచ్చీ ఆదుకొంటివీ - అఖిలలోకములు ఆనందింపగ " శ్రీ శివ "
దేవదానవులు మధువునుగోరి - సాగర మధనము ఆరంభించిరి
ఉద్భవించినా గరళము గ్రోలీ - నీలకంఠునిగ మదిన నిలిచితివి
లంకాసురునీ సమ్హరించెనూ - శ్రీ రఘురాముడు నిను పూజించి
లోకరక్షణా భారమునాదని - యుగయాగములు స్థిరముగనుంటివి " శ్రీ శివ "
వేయికమలములు సమకూర్చుకొనెను - భక్తుడు ఒకడు శివపూజ చేయగ
అర్చన చేయు సమయమందునా - పద్మముయొక్కటి అదృశ్యమాయెను
దిగులు చెందకా పీఠము వదలక - తన కన్నొక్కటి ఒక కమలముగా
అర్చనచేసీ పూజముగించగ- ఎదుట నిలచితివి భక్తుని బ్రోవగ " శ్రి అశివ "
భూతప్రేతములు పిశాచాదులూ - శాఖినీ ఢాకినీ గాలిదయ్యములు
కైలాసమునా ద్వారపాలకులు - నినుసేవించూ అధమసేవకులు
ఏమరుపాటున చేసిన తప్పులు - భూతగణములై పీడించుచున్నవి
ఓరిమిపోయి నీవే శరణని - నమ: శివాయని జపించువాడను " శ్రీ శివ "
ఆత్మలింగమును కోరిన ఘనుడూ - నిను పూజించుచు లంకేశ్వరుడూ
తపము ఫలించక కైలాసగిరినే - పెకిలించనెంచిన బలోపేతుడూ
బొటనవ్రేలితో శిఖరమునదిమిన - నిర్వీర్యునిగా మారిపోయెను
కడుపులో ప్రేగులు వీణతంత్రులుగ - స్వరముపాడగా కరిగిపోతివి " శ్రీ శివ "
శ్రీశైలమందున మల్లికార్జునుడు - రామలింగేశుడు రామేశ్వరమున
భీమేశ్వరుడూ బదరీనాధుడు - బహునామములా వెలసెను శివుడూ
రామలింగములు స్పటికలింగములు - నందివాహనుని మారు రూపములు
రుద్రాభిషేకము చేయుసమయమున నవనీతముగా మారిపోవునూ " శ్రీ శివ "
శివశివయనినా శివసాయుద్యము-కలుగుట సత్యము పాపులకయినను
ఏకాదశులూ పర్వదినములూ - కైలాసమునకు చూపించుత్రోవలు
ఉపవాసములూ జాగరణములూ - ఉమాపతిని మురిపించు క్షణమున
పుత్రపౌత్రాది సౌభాగ్యములతో - చిరకాలముంచెడు దివ్యాస్త్రములు " శ్రీ శివ "
*మంగళహారతి గొనుమా మహేశా - చరణములంటితి శరణు మహేశా
గానము చేతును శివచాలీసా - నిత్యము నామదినుండుము మహేశా *

సేకరణ : శ్రీమతి సీత లక్ష్మి పత్రీ గారు

No comments:

Post a Comment