సౌందర్య లహరి ఆవిర్భావం.
ఒక మారు శంకరులు పరమేశ్వరుని వద్ద వున్న మంత్ర
శాస్త్రాన్ని తీసుకుని రావటానికి కైలసానికి వెళ్లారట.ఆ సమయంలో ఈశ్వరుడు , ఈశ్వరిని
కీర్తిస్తున్నారట. అదే మంత్రం శాస్త్ర సర్వస్వం. దాన్ని గ్రహించి తెస్తుండగా అది
భూలోకానికి చేరటం ఇష్టం లేని న౦దీశ్వరుడు అడ్డుపడగా అది కింద పడిందట. త్వరగా
ఏరుకుని, తీసుకుని వచ్చి చూస్తే 41 శ్లోకాలు మాత్రమె ఉన్నాయట. మిగిలినవి తాను విని
ఉండటం చేత తానె చెప్పారట .ఎంతైనా శివుడు చెప్పినదానికి, దాన్ని విని పునర్నిర్మించిన
దానికి వ్యత్యాసం ఉండటంసహజం.
అందుకే
మొదటి 41 శ్లోకాలకి, తర్వాతి 59 శ్లోకాలకి రచనా విధానం లోను, విషయం లొనూ తేడా
కనబడుతుంది. మొదటి భాగాన్ని ‘ఆనందలహరి’ అని, రెండవ భాగాన్ని ‘సౌందర్యలహరి’ అని
అనటం పరిపాటి. మొదటి 41 శ్లోకాలు అమ్మ సూక్ష్మరూప వర్ణన వుంటుంది. అది సాధకులు ధ్యానగమ్యం.ఉపాసనా
విషయం. 42 శ్లోకం నుండి జగదా౦బను కిరీటాది పాదపర్యంతం వర్ణించటముంటుంది. అమ్మ రూపాన్ని
మనోయవనిక మీద చిత్రించుకోవటానికి వీలుగా
వుంటాయి వర్ణనలు. ఇందులోని శ్లోకాలు శిఖరిణీ వృత్తంలో లయబద్దంగా వుంటాయి.
లలితారహస్యనామ
సాహస్రాన్ని నియమానుసారం చదివే శక్తి సామర్ధ్యాలు లేనివారు, సౌందర్యలహరిని పారాయణం
చేయవచ్చు. లలితా రహస్యనామ సాహశ్రంలో వున్నా సమస్తమైన విజ్ఞానాన్ని సౌందర్యలహరి
అర్థం చేసుకోవటం ద్వారా పొందవచ్చు.
(1వ. శ్లోకం )
శివ: శక్త్యాయుక్తోయది భవతి శక్త:ప్రభవితుం
న చే దేవం దేవో నఖలు కుశల స్పందితు మపి '
అతస్త్వా మారాధ్యాం హరిహర విరిఞ్చాదిభిరపి
ప్రణస్తుం స్తోతుంవా కథ మకృత పుణ్యం ప్రభవతి !
( భావము )
అమ్మా, ఓ భగవతీ ! సర్వమంగళ సహితుడయిన శివుడు జగన్నిర్మాణశక్తివయిన నీతో కూడితేనేగాని జగాలను సృజించటానికి సమర్ధుడుకాదు.నీతో కూడకపోతే ఆదేవుడు తాను కదలటానికి సైతం అశక్తుడు . అలాంటప్పుడు హరి హర బ్రహ్మాదులు చేతను పూజింపదగిన నిన్ను మ్రొక్కటానికిగాని , స్తుతించటానికిగాని , పూర్వజన్మలో పుణ్యం చేయని వ్యక్తి ఎలా సమర్ధుడవుతాడు ? కాడు.
(2వ. శ్లోకం )
తనీయాంసం పాంసుం తవచరణ పఙ్కేరుహ భవం
విరిఞ్చిన్వన్ విరచయతి లోకానవికలం ;
వహత్యేనం శౌరి: కథమపి సహస్రేణ శిరసాం
హర: సంక్షుద్యైనం భజతి భసితోద్థూళనవిధిం
( భావము )
ఓ మాతా! బ్రహ్మదేవుడు నీ చరణకమలాలలో పుట్టిన కించిత్తు పరాగాన్ని గ్రహించి లోకాలను ఎలాంటి వైకల్యం లేకుండా సృజిస్తూవున్నాడు . ఈ ఇంచుకపదరజస్సునే మహావిస్ణువుకూడా ఆదిశేషుడై తన వేయి శిరస్సులతో భారంగా మోస్తున్నాడు. దానినే శివుడు చక్కగా మెదిపి తన శరీరానికి విభూతిగా అలదు కొంటున్నాడు .
(3వ. శ్లోకం )
అవిద్యానా మంతస్తిమిర మిహిరద్వీపనగరీ
జడానాం చైతన్యస్తబక మకరంద స్రుతి ఝరీ ,
దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ
నిమగ్నానాం దంప్ట్రా మురరిపు వరాహస్య భవతి ;
( భావము )
అమ్మా! నీ పాదరేణువు అఙ్ఞానుల తమోంధకారాన్ని పోగొట్టే సూర్యద్వీపనగరం . ఆ నీ పాదలేశం మందబుధ్దులైన జడులకు ఙ్ఞానమనే మకరందాన్ని జాలువార్చే ప్రవాహం; లేమిచేత కుంగిపోయే దరిద్రులకు సకలసంపదలనిచ్చే చింతామణుల శ్రేణి .అంతేగాక జనన మరణ సంసారరూపమైన సాగరంలోమునిగి దరిగానక తపించే వారికి - విష్ణువు అవతారమైన ఆదివరాహస్వామియొక్క కోర అవుతోంది . అంటె ఉద్ధరించేది ;సంసార సాగరాన్ని తరింపజేసేది అని భావం .
(4వ. శ్లోకం )
తదన్య: పాణిభ్యా మభయవరదో దైవతగణ:
త్వమేకా నైవాసి ప్రకటిత వరాభీత్యభినయా ;
భయాత్త్రాతుం దాతుం ఫలమపిచ వాఞ్చాసమధికం
శరణ్యే లోకానాం తవహిచరణావేవ నిపుణౌ ..
( భావము )
భగవతీ ! లోకశరణ్యా ! ఇంద్రాదులైన దేవతాగణం తమ హస్తాలతో అభయ వరముద్రలను ధరించి వరాలను , అభయాన్ని , ప్రసాదిస్తున్నారు. నీవు మాత్రం హస్తాలలో ఎలాంటి వరాభయముద్రలను ధరించవుకదా ! కారణం , ఓ అంబా భక్తులను భయం నుంచి రక్షించటానికి , వారు కోరిన దానికన్నా అధిక ఫలాన్ని ఒసగటానికి , ఆడంబరమైన బాహ్యప్రదర్శన లేని నీ పాదసరోజములే చాలును.
(5వ. శ్లోకం )
హరిస్త్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం
పురా నారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్ |
స్మరో పి త్వాం నత్వా రతినయన లేహ్యేన వపుషా
మునీనా మప్యంత: ప్రభవతి హి మోహాయ మహతాం ||
( భావము )
ఓ జగన్మాతా ! ప్రణమిల్లే భక్తజనులకు సౌభాగ్యాన్ని ప్రసాదించే నిన్ను , పూర్వం శ్రీహరి ఆరాధించి సుందరాంగియై , త్రిపురాలను తెగటార్చి క్రోధావిష్టుడైన శివుడి మనస్సులో సైతం కామవికారాన్ని కలిగించి క్షోభపెట్టగలిగాడు . అలాగే మన్మధుడు నిన్నుకొలిచి,తన సతి రతీదేవి కన్నులను రంజింపజేయగల సౌందర్యాన్ని పొంది, ఆ రూపుతో అరణ్యాలలో తపస్సు చేసుకునే మునుల మనస్సులలో కామాభిలాష కలిగించటానికి సమర్ధుడైనాడు . ఔరా ! నీ ప్రసాద మహత్తు అధ్బుతం కదా !
(6వ. శ్లోకం )
ధను: పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖా:
వసంత స్సామంతో మలయమరు దాయోధన రథ: |
తథాప్యేకస్సర్వం హిమగిరిసుతయే కామపి కృపాం
అపాజ్గాతే లబ్ధ్వా జగదిద మనజ్గో విజయతే ||
( భావము )
ఓ హిమగిరి కుమారీ ! మన్మథుడి విల్లు పువ్వులతో రూపొందించబడినది; వింటినారి తుమ్మెదల శ్రేణి ; పుష్ప నిర్మితమైన బాణాలు ఐదు అతడి అమ్ములపొది;కాలబద్దుడై మళ్ళీ మళ్ళీ వచ్చే వసంతుడు అతడి సామంతుడు . అతడి యుద్దరథం నిరంతరం చలించే రూపులేని మలయమారుతం; ఇలా పనికిరాని పరికరాలు కలిగిన మన్మథుడు అంగరహితుడు , బలిష్ఠమైన మేనులేని వాడు. అయిననూ నిన్నారాధించి , నీకడకంటి కటాక్షంతో ఈజగత్తును తన ఆధీనములోనికి తెచ్చుకుంటున్నాడు.
(7వ. శ్లోకం )
క్వణత్కాఞ్చీదామా కరికలభకుంభస్తననత
పరిక్షీణామధ్యే పరిణత శరచ్చంద్రవదనా |
ధనుర్బాణాన్ పాశం సృణి మపి దధానా కరతలై:
పురస్తా దాస్తాం న: పురమథితు రాహో పురుషికా ||
( భావము )
గణగణమని మ్రోగుతున్న చిరుగంటలతో కూడిన మొలనూలుకలదీ, గున్న ఏనుగు కుంభస్థలాలతో సాటివచ్చే కుచముల భారంచే కాస్త ముందుకు వంగినదీ, సన్నని నడుము కలదీ, శరత్కాల పూర్ణచంద్రుడివంటి నెమ్మోము కలదీ, చెరకు వింటిని, పుష్పబాణాలను, పాశాన్ని , అంకుశాన్ని చేతుల్లో ధరించినదీ, త్రిపురాలను మట్టుపెట్టిన శివుడు శౌర్యస్వరూప ఐన భగవతీదేవి మా ఎదుట సుఖాసీనయై ప్రత్యక్షమగుగాక .
(8వ. శ్లోకం )
సుధాసింధోర్మథ్యే సురవిటపివాటీపరివృతే
మణిద్వీపే నీపోపవనవతి చింతామణిగృహే |
శివాకారే మఞ్చే పరమశివపర్యజ్కనిలయాం
భజంతి త్వాం ధన్యా: కతిచన చిదానందలహరీం ||
( భావము )
తల్లీ! పాలకడలి నడుమ నెలకొన్న రత్నాలదీవిలో, కల్పవృక్షాలవరుసతో చుట్టబడినదైన కదంబచెట్ల పూతోటలలో చెలువొందే చింతామణులతో నిర్మితమైన గృహంలో, పరబ్రహ్మ అయినటువంటి పరమశివ పర్యంకనిలయవై,మంగళరూపమైన (త్రికోణపు) పాంపుపై , నిరతిశయానంద ప్రవాహ స్వరూపిణివైన , నిన్ను కొదరు ధన్యులుమాత్రం సేవిస్తున్నారు. .....* అందరికీ సామాన్యంగా నీ సేవ లభించదని భావం. *
(9వ. శ్లోకం )
మహీం మూలాధారే కమపి మణిపూరే హుతవహం
స్థితం స్వాధిష్ఠానే హృది మరత మాకాశ ముపరి |
మనోపి భ్రూమధ్యే సకలమపి భిత్త్వా కులపథం
సహస్రారే పద్మే సహ రహసి పత్యా విహరసే ||
( భావము )
ఓ భగవతీ ! నువ్వు మూలాధారంలోవున్న పృథివీ తత్వాన్ని , మణిపూర చక్రంలోవున్న ఉదరతత్వాన్ని ,స్వాధిష్ఠాన చక్రంలోని అగ్నితత్వాన్ని , అనాహత చక్రంలోని వాయుతత్వాన్ని ,అంతకు పైనవుండే విసుద్దచక్రంలోని ఆకాశ తత్వాన్ని , కనుబొమల నడుమనుండే ఆఙ్ఞాచక్రంలోని మనస్తత్వాన్ని వీడి, సుషుమ్నా మార్గాన్ని ఛేదించుకొని సహస్రార కమలంలోని నీ భర్త ఐన సదాశివుడితో కూడి రహస్యంగా విహరిస్తున్నావు
(10వ. శ్లోకం )
సుధాధారాసారై శ్చరణ యుగళాంతర్విగళితై:
ప్రపఞ్చం సిఞ్చంతీ పునరపి రసామ్నాయ మహస: |
అవాప్య స్వాంభూమిం భుజగనిభమధ్యుష్టవలయం
స్వమాత్మానం కృత్వాస్వపిషి కులకుణ్డే కుహరిణి ||
( భావము )
అమ్మా, భగవతీ ! నీ (త్రిపురసుందరిగా పేర్కొనే కుండలిని శక్తి ) పాదపద్మాల రెంటి మధ్యప్రదేశం నుంచి స్రవించే అమృత ధారలచేత ప్రపంచాన్ని (డెభ్భైరెండువేల నాడులతో కూడుకున్నజీవుడి దేహాన్ని ) తడుపుతూ ,అమృతతుల్య కాంతిచే వెలుగొందే చంద్రుణ్ణి (సహస్రార ; కుండలినీ శివసాయుజ్య మొందేస్ధానం ) వీడి స్వస్ధానమైన మూలాధారచక్రాన్ని మరల ప్రాపించి ,సుషుమ్న చివర భాగంలో స్వస్వరూపాన్ని గ్రహించి,సర్పం వలె చుట్టచుట్టుకుని కుండలినీ శక్తివై నిద్రిస్తావు
(11వ. శ్లోకం )
చతుర్భిశ్ర్మీకణ్ఠై శ్శివయువతిభి:పఞ్చభిరపి
ప్రభిన్నాభి శ్శంభోర్నవభిరపి మూలప్రకృతిభి: |
చతుశ్చత్వారింశ ద్వసుదళ కలాశ్రత్రివలయ
త్రిరేఖాభి స్సార్ధం తవ శరణకోణా: పరిణతా: ||
( భావము )
తల్లీ, భగవతీ! నలుగురు శ్రీకంఠులతోను (శివచక్రాలు) , ఐదుగురు శివ- యువతులతో (శక్తిచక్రాలు) , మొత్తం తొమ్మిది మూల ప్రకృతులతో , మూలబిందువైన శంభు కాకుండా(శ్రీచక్రములో మధ్యలోని చిన్నచక్రము ) ,నీవు అభివ్యక్తమౌతున్నావు . అష్టదళం ,షోడశదళం ,మేఖలాత్రయం, భూపురం అనే వాటితోను కూడి నీకు నివాసస్ధానమైన శ్రీచక్రం యొక్క కోణాలు నలభైనాలుగు సంఖ్య గలవిగా పరిణమించి ఉన్నవి.(నాలుగు శివచక్రాలతోను , ఐదు శక్తి చక్రాలతోను కూడి తొమ్మిది చక్రాలతో సొంపారుతొందని భావం
(12వ. శ్లోకం )
త్వదీయం సౌందర్యం తుహినగరికన్యే తులయితుం
కవీంద్రా: కల్పంతే కథమపి విరిఞ్చి ప్రభృతయ: |
యదాలోకౌత్సుక్యా దమర లలనాయాంతి మనసా
తపోభి ర్దుష్ప్రాపామపి గిరిశ సాయుజ్య పదవీం ||
( భావము )
ఓ హిమగిరి తనయా ! నీ మేని లావణ్యాన్ని అవయవాల సౌందర్యాన్ని సరిపోల్చి వర్ణించటానికి బ్రహ్మ ,విష్ణువు ,ఇంద్రుడు, మొదలైన కవివరేణ్యులు వేరొక వస్తువు గానక మిన్నకున్నారు .నిన్ను తెలుసుకోలేకుండావున్నారు. అలాంటి నీలోకోత్తర సౌందర్యాన్ని విలోకించ కుతూహలం గలవారై ,అప్సరసలు ( ఊర్వశి,తిలోత్తమ మొదలైనవారు ) నీ అందంతో తాము కించిత్తూ సరిరాకపోయిన వారై ,తపస్సులచేతకూడా పొందరానిదైన పరమశివిడితోడి సాయుజ్యస్థానాన్ని మనస్సుచేత పొంద ఇచ్చగిస్తున్నారు. ( ఒక్క పరమశివుడుమాత్రం నీలో సాయుజ్యమొందగలడు కావున వారు ముందు శివసాయుజ్యమొంది నిన్ను చేరుకోప్రయత్నిస్తున్నారు. .ఆప్రయత్నంలోనూ వారు సఫలీకృతులుగాక ఒక మానశికమైన అనుభూతితో సంతృప్తి చెందుతున్నారని భావము ) .
(13వ శ్లోకం )
నరం వర్షీయాంసం నయనవిరసం నర్మసు జడం
తవాపాజ్గాలోకే పతిత మనుధావంతి శతశ: |
గలద్వేణీబంధా: కుచకలశ విస్రస్త సిచయా:
హఠాత్తృట్య త్కాంచ్యో విగళిత దుకూలా యువతయ: ||
( భావము )
తల్లీ ! కనికరం ఉట్టిపడే నీ కడకంటి చూపుకు పాత్రమైనవాడు ఎంత ముదుసలి ఐనా , వికారరూపుడైనా , శృంగారపరిహాస సంభాషణములందు మందుడైనా ,యువతులు అతగాడినే వలచి తమ కొప్పులు వీడగా ,పైటలు జారగా, మొలనూళ్ళు విడివడి జారుతుండగా , రైక ముడులు వీడిపోయి కట్టుకొన్న పట్టుకోకలు కిందికి జారిపోతుంటె వందలాది ఏతెంచి ఆ పురుషుణ్ణి వెంబడించి పరుగెత్తి వస్తారు. ( తల్లి అనుగ్రహానికి పాత్రుడైనవాడే లోకోత్తర సుందరుడు అని భావము. )
( 14వ. శ్లోకము )
క్షితౌ షట్పఞ్చాశ ద్ద్విసమధిక పఞ్చశదుదకే
హుతాశే ద్వాషష్టి శ్చతురధిక పంచాశ దనిలే |
దివి ద్విష్షట్త్రింశ న్మనశి చ చతుష్షష్టి రితి యే
మయూఖాస్తేషా మప్యుపరి తవపాదాంబుజ యుగం ||
( భావము )
ఓ దేవీ ! అన్ని చక్రాలకు ఉపరిగా సహస్రారచక్ర మధ్యంలో సహస్రదళ పద్మంగా నీవు విరాజిల్లుతావు, నీనుండి వెలుపడిన శక్తిసంజనితమైన తేజ: కిరణాలు యాభైఆరు ,మూలాధారకేంద్రంలో పృథ్విగా పరివర్తనం చెందుతాయి ,మణిపురంలో ఏభైరెండు జలతత్వంగా , స్వాధిష్టానంలో అరవైరెండు అగ్నితత్వంగా ,అనాహతలో ఏభైనాలుగు వాయుతత్వంగా ,విశుద్ద చక్రంలో డెభ్భైరెండు ఆకాశతత్వంగా , ఆఙ్ఞాచక్రంలో అరవైనాలుగు మనస్సుగా పరిణమిస్తాయి .
( 15వ. శ్లోకము )
శరజ్జ్యోత్స్నా శుద్దాం శశియుత జటాజూట మకుటాం
వరత్రాసత్రాణ స్ఫటిక ఘటికా పుస్తక కరాం
సకృనంత్వా నత్వా కథమివ సతాం సన్నిదధతే
మధుక్షీర ద్రాక్షా మధురిమ ధురీణాం: ఫణితయ:
( భావము )
జననీ! శరశ్చంద్రిక మాదిరి పరిశుద్దురాలివై శశియుతమైన జటాజూటమే కిరీటముగా కల్గి రెండు హస్తాలతో వరాభయముద్రలు దాల్చి, మిగితా రెండు చేతులతో అక్షమాలా పుస్తకాలను ధరించిన నిన్ను , ఒక్కమారు నమస్కరించిన, కవీశ్వరులకు పూదేనియతో , గోక్షీరంతో, ద్రాక్షాఫలాలతో సాటివచ్చే మాధుర్యాన్ని వహించిన మధురవాక్కులు ఎలా సంప్రాప్తించకుండా వుంటవి ? ( అలాంటి వాక్కులు ప్రాప్తిస్తాయని భావము ) .
( 16వ. శ్లోకము )
కవీంద్రాణాం చేత: కమలవన బాలాతప రుచిం
భజంతే యే సంత: కతిచి దరుణామేవ భవతీం
విరిఞ్చి ప్రేయస్యా స్తరుణ తరశృజ్గారలహరీ
గభీరాభిర్వాగ్భి ర్విదధతి సతాం రఞ్ఞినమమీ..
( భావము )
తల్లీ! పద్మాలకు ఉదయ కాలపు లేత ఎండ మాదిరి ,కవుల మనోపద్మాలకు వికాసాన్ని కలిగించే అరుణవయిన నిన్ను, ఏ సత్పురుషులు సేవిస్తారో , వారు శారదా ప్రసాద లబ్ధమైన శృంగారరస గంభీరాలైన శుభాషితాలచేత సభాసదులైనసుజనులకు హృదయరంజనం గావిస్తారు.
(17వ. శ్లోకము )
సవిత్రీభిర్వాచాం శశిమణి శిలాభజ్గరుచిభి:
వశిన్యాధ్యాభిస్త్వాం సహజనని సఞ్చస్తయతి య:
స కర్తా కావ్యానాం భవతి మహతాం భజ్గిరుచిభి:
వచోభిర్వాగ్దేవీ వదన కమలామోద మధురై:
( భావము )
అమ్మా! వాక్కులను సృజించేవారూ,చంద్రకాంత మణుల శకలాల మాదిరి తెల్లనయిన దేహ ముఖకాంతి గలవారు ఐన వశిన్యాది దేవతలచే కూడియున్న నీ దివ్యస్వరూపాన్ని ఎవరు ధ్యానిస్తారో అతడు కవి శ్రేష్టుడవుతాడు. సమర్ధుడై కవితల్లజుడవుతాడు .అతని కవిత్వం మృదువైన వాగ్గుంభనలతో ( కాళిదాసు మొదలైన కవులయొక్క కవిత్వ రచన మాదిరి ) రుచిమంతమై , సరస్వతీ దేవియొక్క ముఖ కమల పరిమళాలను వెదజల్లుతుంది
( 18వ. శ్లోకము )
తనుచ్ఛాయాభిస్తే తరుణ తరణి శ్రీ సరణిభి:
దివం సర్వాముర్వీ మరుణిమనిమగ్నాం స్మరతి య:
భవంత్యస్య త్రస్యద్వనహరిణి శాలినీ నయనా:
సహోర్వశ్యా వశ్యా: కతికతి న గీర్వాణ గణికా:
( భావము )
తల్లీ,భగవతీ ! ఉదయిస్తూన్న బాలసూర్యుడి కాంతి పుంజాలను వెదజల్లుతున్న నీ నెమ్మేని కెంజాయలచే భూమ్యాకాశాలు కెంపు జిగుల మున్నీటిలో మునుగుతున్నాయి .ఆ నీ దివ్యతేజోరూపాన్ని ధ్యానించునతనికి బెదిరిన లేడికన్నులవంటి కన్నులుగల అప్సరస కన్యలు ఊర్వశి సైతం వశులవుతారు. ( అమ్మ లోకాతీతమైన దివ్యమంగళ రూపాన్ని ధ్యానించువారు సర్వసమ్మోహన రూపాన్ని పొందుతారు. అందరు వారికి ఆకర్షితులవుతారని భావము.
(19వ, శ్లోకము )
ముఖం బిందుం కృత్వా కుచయుగ మధస్తస్య తదధో
హరార్ధం ధ్యాయేద్యో హరమహిషి తే మన్మధ కలాం
ససద్య స్సంక్షోభం నయతి వనితా ఇత్యతి లఘు
త్రిలోకీ మప్యాశు భ్రమయతి రవీందుస్తన యుగాం ...
( భావము )
ఓ మాతా! నీ ముఖారవిందాన్ని జగద్బీజంగా ( బిందువుగా ) సూర్యచంద్రులు సృష్టి స్వరూపిణివైన నీ కుచయుగ్మంగా , బౌతికజగత్తు మొత్తం నీ ప్రకృతిగా ( పురుషుడైన శివునిలో అర్ధభాగం ; హరార్ధం ) తలచి నీ మన్మథకల ( జీవుడిని భ్రాంతికి గురిచేసే స్వభావం) నెవడు ధ్యానిస్తారో అతడు మరుక్షణాననే వనితల మనస్సులను సంక్షోభపెట్టటం మాత్రమే కాదు.ముల్లోకాలనే మోహపరచగలదు. (జనులను బ్రాంతికి గురిచేసి , కర్మబద్దులను చేస్తున్న దృశ్యమాణ జగత్తు యావత్తు అమ్మరూపంగా తెలుసుకొని ఎవరు ఆమె మంగళరూపాన్ని ధ్యానిస్తారో వారు ఈ విషయజగత్తు తో సమ్యోగాన్ని వీడి ముక్తులవుతారని అంతరార్ధము ) ..
( 20వ, శ్లోకము )
కిరంతీ మజ్గేభ్య: కిరణ నికురుంభామృతరసం
హృది త్వా మాధత్తే హిమకర శిలామూర్తి మివ య:
స సర్పాణాం దర్పం శమయతి శకుంతాధిప ఇవ
జ్వరప్లుష్టాన్ దృష్ట్యా సుఖయతి సుధాధార సిరయా .
( భావము )
తల్లీ! చంద్రకాంతిమణివలె అమృత రసాన్ని పోలిన చల్లని కిరణాలను ప్రసరించే నీ దివ్యరూపాన్ని ఏ సాధకుడు హృదయంలో ప్రతిష్టించుకుని ధ్యానిస్తాడో అతడు గరుత్మతుడిలా సర్పాల దర్పాన్ని శమింపజేయగలడు .( విషసర్పాలవంటి కష్టాలు అతడిని చలింపజేయలేవని అంతరార్ధము ) భవజ్వర పీడితులకు అతడి వీక్షణం అమృతరసధార అవుతుంది ...
( 21వ, శ్లోకము )
తటిల్లేఖా తన్వీం తపనశశి వైశ్వా నరమయీం
నిషణ్ణాం షణ్ణామప్యుపరి కమలానాం తవ కలాం
మహాపద్మాటవ్యాం మృదితమలమాయేన మనసా
మహాంత: పశ్యంతో దధతి పరమాహ్లాదలహరీం ..
( భావము )
తల్లీ ! భగవతీ! మెరుపుతీగవంటిది ; సూర్యచంద్రాగ్ని ప్రభసమాన మైనది; షట్చక్రాలలో ఉపరిదైనది ఐన సహస్రార మహాపద్మాటవిలో కూర్చున్న నీ సదాఖ్య ( శివ శక్తుల సాయుజ్యం ; ప్రకృతి పురుషుల కలయిక ) కళను మహాత్ములు , పరిపక్వచిత్తులు పరమాహ్లాద లహరిగా అనుభూతినొందుతున్నారు.అంటే నిరతిశయానందాన్ని సదా పొందుతున్నారని భావం....
( 22వ, శ్లోకము )
భవాని త్వం దాసే మయి వితర దృష్టిం సకరుణాం
ఇతి స్తోతుం వాంఛన్ కథయతి భవానీ త్వమితియ:
తదైవ త్వం తస్మై దిశసి నిజసాయుద్యపదవీం
ముకుంద బ్రహ్మైంద్ర స్ఫుట మకుట నీరాజిత పదాం..
( భావము )
తల్లీ ! భవాని! "నేను నీ దాసుణ్ణి , నీ కృపా కటాక్ష వీక్షణం నాపై ప్రసరింపజేయి " , అని ఉపాసకుడు ప్రార్ధించినంతనే అతడికి ముకుంద బ్రహ్మేంద్రులు తమ రత్నకిరీటాలచేత నీరాజనం గావించే నీ పాదపద్మాలతో సాయుద్యాన్ని కల్పిస్తున్నావు . (సాయుద్యముక్తిని కల్పిస్తున్నావు అని భావము )
( 23వ, శ్లోకము )
త్వయా హృత్వా వామం వపు రపరితృప్తేన మనసా
శరీరార్ధం శంభో రపరమపి శజ్కే హృతమభూత్
యదేత త్త్వద్రూపం సకల మరణాభం త్రినయనం
కుచాభ్యా మానమ్రం కుటిల శశి చూడాల మకుటం ..
( భావము )
.. ఓ జగన్మాతా ! నీవు తొలుత శంభుడి శరీర వామభాగాన్ని గ్రహించి తనివితీరని మనస్సుతో అర్ధనారీశ్వరుడి తక్కిన సగంకూడా గ్రహించావని నాకు తోచుచున్నది. ఏలనన నాహృదయంలో విరాజిల్లుతున్న నీ దివ్య శరీరం ఉదయభానుడి కాంతితో సాటివచ్చే కెంపు కాంతులతో ఒప్పారుతూ, పాలిండ్ల జంటచే యించుకు ముందుకు వంగినట్లు కనబడుతూ , మూడుకన్నులు కలిగి వంపుతిరిగిన చంద్రకళ శిరోమణిగా ఉన్న కిరీటంతో సొంపారుతూ విరాజిల్లుతుంది. ( శివతత్వాన్ని తనలో లయం చేసుకున్నదని భావము. )
( 24వ, శ్లోకము )
జగత్సూతే ధాతా హరిరవతి రుద్ర: క్షపయతే
తిరస్కుర్వ న్నేతత్స్వమపి వపురీశ స్తిరయతి
సదాపూర్వ స్సర్వం తదిద మనుగృహ్ణాతి చ శివ:
తవాఙ్ఞా మాలంబ్య క్షణచలితయోర్ర్భూ లతికయో: ....
( భావము )
ఓ భగవతీ! సృష్టికర్త ఐన బ్రహ్మ ఈ విశ్వాన్ని సృష్టిస్తున్నాడు. మహావిష్ణువు రక్షిస్తున్నాడు. రుద్రుడు విశ్వాన్ని లయింపజేస్తున్నాడు. ( కల్పాంతంలో ) మహేశ్వరుడు ఈ బ్రహ్మవిష్ణురుద్రులను తనలో లీనం చేసుకుని సదాశివతత్వంలో అంతర్భూతం చేస్తున్నాడు .ఇలా ఈ బ్రహ్మాండం లయమయిపోతొంది . తిరిగి సదాశివుడు ( కల్పాదిలో) నీవు కనుబొమలను క్షణమాత్రం కదిలించిననే , అదేఆఙ్ఞగా గ్రహించి ఈ నాలుగు తత్వాలతో మళ్ళీ యధావిధిగా బ్రహ్మాండ సృష్ట్యాది కార్యాలు జరిపిస్తూ ఉన్నాడు...
( 25వ, శ్లోకము )
త్రయాణాం దేవానాం త్రిగుణ జనితానాం తవశివే
భవేత్పూజా పూజా తవ చరయో ర్యా విరచితా
తథాహి త్వత్వాదోద్వహన మణి పీఠస్య నికటే
స్థితా హ్యేతే శశ్వ న్ముకుళిత కరోత్తంసమకుటాః
( భావము )
ఓ శివానీ ! నీ చరణాలకు గావించే పూజే నీ త్రిగుణాలవల్ల జనించినవారైన త్రిమూర్తులకు చేసే పూజకూడా .వారికి ప్రత్యేక పూజలవసరంలేదు. .ఎందుకంటే వారు సదా నీ పాదాలను వహిస్తున్న నవరత్న ఖచిత పీఠానికి సమీపంలోజేరి హస్తాలు, తమ మణిమయ శిరోమకుటాలకు తాకునట్లు వహించి మొక్కుతూ , నీ ఆఙ్ఞను శిరసావహిస్తుంటారు. భగవతి పాదసేవ ఆమె అనుగ్రహం వలననే లభిస్తుందని భావము.
( 26వ శ్లోకము )
విరిఞ్చిః పఞ్చత్వం వ్రజతి హరి రాప్నోతి విరతం
వినాశం కీనాశో భజతి ధనదో యాతి నిధనం
వితంద్రీ మాహేంద్రీ వితతిరపి సమ్మీలితదృశా
మహాసమ్హారే స్మిన్ విహరతి సతి త్వత్పతిరసౌ ....
( భావము )
తల్లీ ! జగజ్జననీ మహాప్రళయం సంభవించిన సమయంలో బ్రహ్మ పంచభూతాలలో లయమవుతున్నాడు . మహావిష్ణువు నిర్లప్తమవుతున్నాడు యముడూ వినాశనాన్ని పొందుతున్నాడు . కుబేరుడు తన ప్రాభవాన్ని కోల్పోతున్నాడు .పదునల్గురు మనువులు , పదునల్గురు ఇంద్రులు కన్నుమూస్తున్నారు. కానీ ఓ సతీదేవీ! ఆసమయంలోకూడా నీభర్త సదాశివుడు ( నీ పాతివ్రత్యం మహత్యంవల్ల ) విశృంఖలుడై స్వేచ్ఛగా విహరిస్తున్నాడు ...
( 27వ శ్లోకము )
జపో జల్ప శ్శిల్పం సకలమపి ముద్రావిరచనా
గతిః ప్రాదక్షిణ్య క్రమణ మశనాధ్యాహూతి విధి:
ప్రణామ స్సంవేశ సుఖమఖిల మాత్మార్పణ దృశా
సపర్యా పర్యాయ స్తవభవతు యన్మే విలసితం ..
( భావము )
అమ్మా, భగవతీ ! ఆత్మార్పణ దృష్టితో నేను చేసే సల్లాపం నీ మంత్రజపం నా హస్తవిన్యాసమంతా నీ అర్చనలో ముద్రారచన , నా స్వేచ్ఛాగమనం నీకు గావించే ప్రదక్షిణ , నాభోజనాదులు నీకు ఆహుతి, నా శయనక్రియ నీకు ప్రణామం , నా సుఖలాలసంతా నీ పూజావిలసము అగుగాక! (అలా అయ్యేట్లు నువ్వు నన్ను కరుణించు తల్లీ )
( 28వ.శ్లోకము )
సుధా మప్యాస్వాధ్య ప్రతిభయ జరామృత్యు హరిణీం
విపద్యంతే విశ్వే విధి శత మఖాద్యా దివిషదః
కరాళం యత్ క్ష్వేళం కబలితవతః కాలకలనా
న శంభో స్తన్మూలం తవ జనని తాటజ్కమహిమా ..
( భావము )
తల్లీ! బ్రహ్మ ఇంద్రుడు ఆదిగాగల సకలదేవతలూ భయంకరమైన జరామృత్యువులను హరించే అమృతాన్ని గ్రోలి ప్రళయకాలంలో మరణిస్తున్నారు. అతిభయంకరమై లోకాలను దహించే కాలకూటమనే మహావిషాన్ని భక్షించిననూ నీ పతి శంభుడికి ( శివుడికి ) మరణం సంభవించలేదు. ఇందుకు ముఖ్యకారణం నీ చెవులకు భాసిల్లే రత్న తాటంకాలు ( రత్నాల కమ్మల ) ప్రభావమే కదా !నీ తేజస్సు మహిమ అంత అద్భుతమైనదని భావము.
(29వ.శ్లోకము )
కిరీటం వైరిఞ్చిం పరిహర పురః కైటభ భిదః
కఠోరే కోటీరే స్ఖలసి జహి జంభారి మకుటం
ప్రణమ్రేష్వేతేసు ప్రసభముపయాతస్య భవనం
భవస్యాభ్యుత్ఠానే తవ పరిజనోక్తి ర్విజయతే ..
( భావము )
మాతా ! ఈ బ్రహ్మ విష్ణువు ఇంద్రులు నీకు ప్రణమిల్లుతున్నపుడు , నీ భవనాన్ని ప్రవేశించిన సదాశివుణ్ణి ఎదురేగి తోడుకొని రావటానికి నువ్వు అతి శీఘ్రంగా లేచి వెళ్ళేటప్పుడు నీ పరిజనులైన స్త్రీలు , అమ్మా ! నీ ముందు బ్రహ్మదేవుడి కిరీటం వుంది. దానికి దూరంగా నడువు ; ఓతల్లీ! ఇది కైటభాసురుణ్ణి సమ్హరించిన విష్ణువు కిరీటం, తొట్రుపడబోకు; .అమ్మా! ఇది ఇంద్రుని కిరీటం , జాగ్రత్తగారమ్ము ;అనే మాటలు సర్వోత్కర్షతో రాజిల్లుతున్నవి.
( 30వ, శ్లోకము )
స్వదేహోద్భూతాభి ర్ఘృణిభి రణిమాద్యాభిరభిత:
నిషేవ్యే నిత్యే త్వామహమితి సదా భావయతి య:
కిమాశ్చర్యం తస్య త్రినయన సమృద్ధిం తృణయత:
మహాసంవర్తాగ్ని ర్విరచయతి నీరాజనవిధం ..
( భావము )
ఓ ఆద్యంతాలు లేని మాతా! నీ పాదాలనుండి జనించిన కాంతులైన అణిమాది
అష్టసిద్దులచే పరివేష్టింప బడియున్న నీదివ్యరూపాన్ని ఏ భక్తుడైతే పూర్తి
తాదాత్మ్యంతో ధ్యానిస్తాడో అతడు త్రినయనుడని పేరుగల సదాశివుడి నిండు
ఐశ్వర్యాన్ని కూడా తృణీకరించగలడు. . ఆ సాధకుడికి మహాప్రళయకాలంలో జ్వలించిన
అగ్ని నీరాజనం గావించటంలో ఆశ్చర్యమేముంది? ( శ్రీదేవితో తాదాత్మ్యం పొందిన
సాధకుడు శ్రీదేవియే .ఆమెకు ప్రళయాగ్ని నీరాజనాలర్పిస్తుంది ) .
( 31వ శ్లోకం )
చతుష్షష్ట్యా తంత్రై: సకల మతిసంధాయ భువనం
స్థితి స్తత్త త్సిధ్ధి ప్రసవపరతంత్రై: పశుపతి:
పునస్త్వన్నిర్భంధా దఖిల పురుషా ర్ఠైకఘటనా
స్వతంత్రం తే తంత్రం క్షితితల మవాతీతరదిదం .
( భావము )
అమ్మా, భగవతీ! పశుపతి అరవై నాలుగు విధాలైన మహామాయా శంబరాది తంత్రాలను ఈ
భూమండలంలో ప్రవేశపెట్టాడు . సకలసిద్ది ప్రదాయకమూ , ఐహిక ఫల ప్రదాయికాలూ ఐన
ఈ తంత్రాలద్వారా సమస్త ప్రపంచాన్ని మోహింపజేసి మిన్నకున్నాడు .మళ్ళా నీ
అభీష్టం మేరకు ధర్మార్ధ కామమోక్షాలనే చతుర్విధ పురుషార్ధాలను
ప్రసాదించేదైన నీ ఈ తంత్రాన్ని ( శ్రీవిద్యా తంత్రాన్ని ) ఈ లోకానికి
ప్రసాదించాడు ..
( 32వ. శ్లోకము )
శివ శ్శక్తి కామ: క్షితి రథ రవిశ్శీతకిరణ:
స్మరో హంస శుక్ర స్తదనుచ పరా మార హరయ:
అమీ హృల్లేఖాభి స్తిసృభి రవసానేషు ఘటితా
భజంతే వర్ణాస్తే తవ జనని నామావయవతాం ...
( భావము )
ఓ జననీ! శివుడు ,శక్తి ,కాముడు, క్షితి; రవి,శీతకిరణుడు
,స్మరుడు,హంసుడు, శుక్రుడు పరా( శక్తి ) మన్మధుడు, హరి అనేవారి సంకేతాలైన
వర్ణాలు మూడు హృల్లేఖలు , చివరలో చేరగా ఆ వర్ణాలు, ఓ మాతా!నీ
నామరూపమవుతున్నాయి. ( నీ మంత్రమవుతున్నవి ) .మంత్రం, క ఏ ఈ ల హ్రీం , హ స
క హ ల హ్రీం, స క ల హ్రీం, అని. ఇదే పంచదశీ మంత్రం లేక పంచదశాక్షరీ
మంత్ర మవుతోందని తెలియనగును...
( 33వ. శ్లోకము )
స్మరం యేనిం లక్ష్మీం త్రితయ మిద మాదౌ తవమనో:
నిధా యైకే నిత్యే నిరవధి మహాభోగరసికా:
భజంతి త్వాం చింతామణి గుణ నిబధ్ధాక్షవలయా:
శివాగ్నౌ జుహ్వంత స్సురభి ఘృతధారాహుతి శతై:
( భావము )
ఓ నిత్యస్వరూపిణీ! నీ మంత్రానికి ముందు కామరాజబీజం , భువనేశ్వరీ బీజం,
లక్ష్మీ బీజం, ( ఈ మూడింటి ఐం హ్రీం శ్రీం ) కలిపి నిరవధిక
మహాభోగరసికులు సకల సిరులను వాంఛిస్తూ , చింతామణులనే రత్నాలతో కూర్పబడిన
అక్షమాలలను చేతుల్లో ధరించి , కామధేనువుయొక్క నేతి ధారలతో శివాగ్నిలో అనేక
ఆహుతులర్పిస్తూ , హోమం చేస్తూ నిన్ను సేవిస్తూన్నారు.
( 34వ.శ్లోకము )
శరీరం త్వం శంభోశ్శశిమిహిర వక్షోరుహయుగం
తవాత్మానం మన్యే భగవతి నావాత్మాన మనఘం
అతశ్శేష శ్శేషీ త్యయ ముభయసాధారణతయా
స్థితస్సంభంధోవాం సమరస పరానంధ పరయో:
( భావము )
ఓ భగవతీ! నీవు శంభుడికి రవిచంద్రులు స్తనయుగంగాగల శరీరమవుతున్నావు. అమ్మా!
నీశరీరాన్ని దోషరహితమైన నవ వ్యూహాత్మకమైన ( కాల,కుల,నామ, ఙ్ఞాన,
చిత్త,నాద,బిందు,కళా, జీవ తొమ్మిది వ్యూహాలు కలిగి వుంటాడు కాబట్టి
శంభుడికి నవాత్మ అని ఇంకోపేరు ) ఆనందబైరవుడిగా తలచుతాను. ఇందువల్ల ఈ శేష (
సంబంధిత వస్తువు ) శేషీ ( మూలవస్తువు ) భావసంబంధం కలిగి ఆనందబైరవ,
ఆనందబైరవీ, రూప చిచ్ఛక్తులయిన మీ ఇరువురికీ (శివశక్తులకు)
సరిసమానంగావుంది. అని తలంతును. ఇరువురూ అవినాభావ సంబంధం కలిగి సమాన
ప్రతిపత్తి కలవారని భావము.
( 35వ శ్లోకము )
మనస్త్వం వ్యోమ త్వం మరుదసి మరుత్సారథి రసి
త్వ మాప స్త్వం భూమి స్త్వయి పరిణతాయాం నహి పరం
త్వమేవ స్వాత్మానం పరిణమయితుం విశ్వవపుషా
చిదానందాకారం శివయువతిభావేన బిభృషే ..
( భావము )
ఓ భగవతీ ! మనస్సు నీవు, ఆకాశం, మరుత్తు, అగ్ని, జలం,భూమి, నీవు . నీవు
పంచభూతాత్మకమైన ఈ ప్రపంచంగా ప్రకటితమవుతున్నావు. నీకంటే ఇతరం ఏదీలేదు.
.నీవు ఈప్రపంచంగా అభివ్యక్తమవ్వటానికి చిదానందరూపాన్ని ధరిస్తున్నావు.
ప్రకృతిగా ,శివానీగా రూపుదిద్దుకున్నావని భావము... ..
( 36వ. శ్లోకము )
తవాఙ్ఞాచక్రస్థం తపన శ్శికోటిద్యుతిధరం
పరం శభుం వంధే పరిమిళితపార్శ్వం పరచితా
యమారాధ్య న భక్త్యా రవిశశిశుచీనా మవిషయే
నిరాలోకే లోకే నివసతిహి భాలోకభువనే ...
( భావము )
తల్లీ!నీ ఆఙ్ఞాచక్రం అధిష్టించివుండి , రవిచంద్రకోటి కాంతితో భాసిల్లుతూ
, పరాచైతన్యంగా అభివ్యక్తమవుతూ నీలో భాగమైన పరశంభునికి నమస్కరిస్తున్నాను.
ఈ శంభుడిని పరమ భక్తితో ఆరాధించే భక్తుడు సూర్యచంద్రాదులతేజస్సును దాటి
అన్నిలోకాలకు ఆవలది ఐన జ్యోతిర్లోకంలో నివసిస్తాడు.....
( 37వ. శ్లోకము )
విశుద్దౌ తే శుద్దస్ఫటికవిశదం వ్యోమజనకం
శివం సేవే దేవీమపి శివసమానవ్యసితాం
యయో: కాన్య్తా యాన్య్తా శృశికిరణసారూప్యసరణే
ర్విధూతాన్ తర్ధ్వాంతా విలసతి చకోరీవ జగతీ ....
( భావము )
ఓ భగవతీ! నీ విశుద్ద చక్రంలో శుద్దస్పటిక నిర్మలుడై విరాజిల్లుతూ
వ్యోమ జనకుడైన శివుణ్ణి అతడితో సమానంగా భాసించే దేవివైన నిన్ను
ఉపాసిస్తున్నాను. మీ ఉభయులనుండి జనించే చంద్రకిరణ సారూప్య సరణి ఐన
కాంతివల్ల జగత్తు అఙ్ఞానాంధకారం నుంచి దూరితమై చకోరపక్షి మాదిరి
విలసిల్లుతుంది...
( 38వ. శ్లోకము )
సమున్మీల త్సంవిత్కమల మకరందైకరసికం
భజే హంసద్వన్ ద్వం కిమపి మహతాం మానవచరం ,
యదాలాపా దష్టాదశగుణిత విద్యాపరిణతి:
యదాదత్తే దోషా ద్గుణ మఖిల మద్భ్య: పయ ఇవ ...
( భావము )
జననీ! ఏ హంసద్వయం ( శివ-శక్తి ) యొక్క ఆలాపంవల్ల అష్టాదశ విద్యలు
పరిణమించినవో , ఏజంట నీరం నుంచి క్షీరం మాదిరి దోషం నుంచి
సద్గుణసముదాయాన్ని వేరు చేసి గ్రహిస్తొందో ; ఏ యుగళము వికశించిన అనాహత కమలం
లోని మకరందాన్ని గ్రోలటంలో ఆసక్తి కలిగినదియై , యోగీశ్వరుల మనస్సు అనే
మానస సరస్సులో సంచరిస్తూ అనిర్వాచ్యమో ఆహంస ద్వయాన్ని భజిస్తున్నాను..
( 39వ.శ్లోకము )
తవ స్వాధిష్ఠానే హంతవహమథిస్ఠాయ నిరతం
తమీదే సంవర్తం జనని మహతీం తాం చ సమయాం
యదాలోకే లోకాన్ దహతి మహతి క్రోధకలితే
దయార్ద్రా యా దృష్టి శ్శిశిరముపచారం రచయతి ...
( భావము )
ఓ తల్లీ! నీ స్వాధిష్ఠాన చక్రంలో సంవర్తమనే పేరుతో ప్రభవించిన
అగ్నితత్వాన్ని ( ప్రళయకాలంలో విజృంభించే కాలాగ్నిరుద్రుడిని ) మహాశక్తి
స్వరూపమూ ,సమయవైన నీతోకూడి నిరతము స్తుతిస్తాను . ప్రచండమైన తన
క్రోధాగ్నితో రుద్రుడు లోకాలను దహిస్తున్నప్పుడు నీవు దయార్ధ్ర హృదయవై
,నీచల్లని కృపావీక్షణాలతో లోకాలకు సేదతీరుస్తావు ....
( 40వ. శ్లోకము )
తటిత్వస్తం శక్త్యా తిమిరపరిపంథి స్ఫురణయా
స్ఫురన్నానారత్నాభరణ పరిణద్థేంద్రధనుషం,
తవ శ్యామం మేఘం కమపి మణిపూరైకశరణం
నిషేవే వర్షంతం హరమిహిరతప్తం త్రిభువనం ....
( భావము )
అమ్మా ! ఓ భగవతీ! మణిపూరచక్రమే ముఖ్యస్థానంగా గలదై ప్రళయకాల రుద్రుడనే
సూర్యుడిచే ( దు:ఖం ) తపింపజేయబడిన ఈ ముల్లోకాలను ( కృపామృత ) వర్షధారలచే
తడుపుతూ , మెరుపుతీగలతో కూడి అంధకారాన్ని (అఙ్ఞానాన్ని ) రూపు మాపుతూ
రత్నాలచేత నిర్మించబడిన ఆభరణాల కాంతితో ఏర్పడిన ఇంద్రధనస్సుతో (
ఙ్ఞానదీప్తి ) కూడినది, అనిర్వచనీయమైనది , శివశక్త్యాత్మకమైన నీ
నీలిమేఘాన్ని ( దయాస్వరూపం ) సేవిస్తాను ....
( 41వ. శ్లోకము )
తవాధారే మూలే సహ సమయయా లాస్యపరయా
నవాత్మానం మన్యే నవరస మహాతాణ్డవనటం,
ఉభాభ్యామేతాభ్యా ముదయవిధి ముద్దిశ్య దయయా
సనాథాభ్యాం జఙ్ఞే జనకజననీమ జ్జగదిదం ...
( భావము )
తల్లీ! నీయొక్క మూలాధారచక్రంలో లాస్యరూపనృత్యాన్ని అనుష్ఠిస్తున్న సమయ (
మహాభైరవ ) తోకూడి నవరసభరిత మహాతాండవ నృత్యాన్ని చేస్తున్న
నవప్రకాశకుడు, నవాత్మకుడు ఐన మహాభైరవుడిని ధ్యానిస్తాను. ( శివ-శక్తి
స్వరూపమైన నిన్ను ధ్యానిస్తాను అని భావము ) ఉత్పత్తి విధి నుద్దేశించి
దయతో ఏకమైన మీ ఇరువురిచే ఈ జగత్తు జననీ జనకులు గలదైనది..
( 42వ శ్లోకము )
గతైర్మాణిక్యత్వం గగనమణిభి స్సాంధ్రఘటితం
కిరీటం తే హైమం హిమగిరి సుతే కీర్తయతి య: ,
స నిడేయచ్ఛాయాచ్ఛురణ శబలం చంద్రశకలం
ధను శ్శౌనాసీరం కిమితి న నిభద్నాతి ధిషణాం ...
( భావము )
హిమవంతుడి పుత్రికవైన ఓ తల్లీ! ఆకసంలో వెలుగొందుతూ ఉన్న ద్వాదశాదిత్యులనే
మాణిక్యాలచే కూర్పబడినదైన నీ బంగారు కిరీటాన్ని ఎవరు వర్ణిస్తున్నాడో
ఆకవీంద్రుడు , వివిధ దివ్య కాంతులీనుతూ నీకు పాపట బొట్టైఉన్న చంద్రరేఖను
కాంచి అదినిజంగా ఇంద్రధనుస్సే ఐవుంటుందని ఎందుకు భావించడు..
( 43వ. శ్లోకము )
ధునోతు ధ్వాంతం న స్తులిత దళితేందీవర వనం
ఘనస్నిగ్ధశ్లక్ష్ణం చికుర నికురుంబం తవ శివే
యదీయం సౌరభ్యం సహజముపలబ్ధుం సుమనసో
వసంత్యస్మి న్మన్యే వలమధనవాటీవిటపినాం...
( భావము )
ఓ భగవతీ! అప్పుడే వికసిస్తున్న నల్లకలువ తండమును ధీటుగా చేసుకొన్నదీ,
కారు మొగులువలె దట్టమై , చిక్కనై, నునుపై సుగంధి తైలముతో కూడుకొన్నదివలె
మృదులమైన నీ నెరికరలు మొత్తం మా అఙ్ఞానాన్ని పోగొట్టుగాక! నీ కేశపాశం
యొక్క సహజ సౌరభాన్ని పొందటానికి మహేంద్రుడి ఉద్యానవనంలోని కల్పవృక్షాల
పుష్పాలు నీ కేశ సముదాయాన్ని ఆశ్రయించి యున్నవి. ( ఆపుష్పాలు నీ కురులకు
సౌరభాన్ని ఆపాదించటానికి బదులుగా అవే నీకురులనుండి సౌరభాన్ని
గ్రహిస్తున్నాయని భావము.
( 44వ. శ్లోకము )
తనోతు క్షేమం న స్తవ వదనసౌందర్యలహరీ
పరీవాహస్రోతస్సరణిరివ సీమంతసరణి:,
వహంతీ సిందూరం ప్రబల కబరీభార తిమిర
ద్విషాం బృందై ర్బందీకృతమివ నవీనార్క కిరణం...
( భావము )
అమ్మా భగవతీ! పొంగుతూ జాలువారే నీ ముఖలావణ్యమనే ప్రవాహానికి నీ పాపటిదారి
నీటిపాయ మాదిరి శోభిల్లుతున్నది. ఆ పాపటిదారిని అలంకరించిన నీ
సిందూరపుబొట్టు , బలమైన కేశపాశాల సముదాయాల మధ్య చిక్కుకున్నదై , బాలభానుడి
కిరణాలను అడ్డుకోజూస్తున్న తొలిపొద్దు చీకట్ల మాదిరి తోచుచున్నది. అలాంటి
నీ దివ్య ముఖారవిందం మాకు యోగక్షేమాలను కలుగజేయుగాక!.
( 45వ. శ్లోకము )
అరాళైస్స్వాభావ్యా దళికలభసశ్రీభిరలకై:
పరీతం తే వక్త్రం పరిహసతి పజ్కేరుహరుచిం ,
ధరస్మేరే యస్మిన్ దశనరుచికిఞ్ఙల్కరుచిరే
సుగంధౌ మాధ్యంతి స్మరదహన చక్షుర్మధులిహ: ....
( భావము )
తల్లీ! కొదమ తుమ్మెదల చాయకల్గి , గిరిజాలవంటి ముంగురులచే ఆవృతమైన నీ
వదనం, పద్మం యొక్క సౌరభాన్ని పరిహసిస్తోంది. చిరునగవుల పంటి తళుకులనే
కేసరముల ( అకరు పువ్వుల ) అందమైన సుగంధంగల ఆ మోమునందు మన్మథుణ్ణి జయించిన
శివుడి చూడ్కులనే తుమ్మెదలు ముదమందుతూ మత్తుగొంటున్నవి..
( 46వ. శ్లోకము )
లలాటం లావణ్యద్యుతివిమల మాభాతి తవ యత్
ద్వితీయం తన్మన్యే మకుటఘటితం చంద్రశకలం ,
విపర్యాసన్యాసా దుభయ మపి సంభూయ చ మిథ:
సుధాలేపస్యూతి: పరిణమతి రాకాహిమకర:
( భావము )
మాతా! లావణ్యమనే వెన్నెలచేత విమలమై భాసిల్లుతున్న, మకుట ఘటితమైన నీ
లలాటాన్ని తలక్రిందులుగా అమర్చిన ద్వితీయ చంద్రఖండంగా తలచుతాను..నీ సిగపూవు
అర జాబిలీ , నొసట అర జాబిలీ రెండింటినీ కలిపిన ఆకలయిక సుధారస సాంద్రమయిన
పూర్ణచంద్రబింబంగా పరిణమిస్తుంది..
( 47వ. శ్లోకము )
భ్రువౌ భుగ్నే కించిద్భువనభయభజ్గవ్యసనిని
ద్వితీయే నేత్రాభ్యాం మధుకరరుచిభ్యాం ధృతగుణం ,
ధును ర్మన్యే సవ్యేతరకరగృహీతం రతిపతే:
ప్రకోష్ఠే ముష్టౌచ స్థగయతి నిగూధాంతర ముమే ...
( భావము )
ఓ మాతా! ఉమాదేవీ, సకల భువనాలకు కలిగే ఉపద్రవాలను తొలగించటంలో ఆసక్తిగల ఓ
తల్లీ ! కొంచెం చిట్లించిన నీ కనుబొమలు మన్మధుడి ధనుస్సును మరపిస్తూ ,
తుమ్మెదలవంటి నీ కాటుకకన్నులు వింటినారి అయి శోభిల్లుతున్నాయి. నీ
ముక్కుపుడక ధనుస్సు మధ్య భాగాన్ని కప్పిపుచ్చుతూ స్మరహరుడి కుడిచేయి
ముంజేయి పిడికిలిగా అన్నట్లు భాసిల్లుతున్నది..
( 48వ.శ్లోకము )
అహస్సూతే సవ్యం తవ నయనమర్కాత్మకతయా
త్రియామాం వామం తే సృజతి రజనీనాయకతయా ,
తృతీయా తే దృష్టి ర్ధరదళితహేమాంబుజరుచి
స్సమాధత్తే సంధ్యాం దివసనిశయో రంతరచరీం ...
( భావము )
ఓ భగవతీ! నీకుడికన్ను సూర్యాత్మకమైన పగటిని సృజిస్తోంది. నీ ఎడమ కన్ను
చంద్రుడు అధిదేవతగాగల రాత్రిని కలిగిస్తుంది. ఇంచుక వికసించిన
సువర్ణకమలాన్ని పోలిన నీ మూడవ నేత్రం దివారాత్రాల నడుమ కలిగే సంధ్యలను
ఏర్పరుస్తోంది.....
( 49వ.శ్లోకము )
విశాలా కల్యాణీ స్ఫుటరుచి రయోధ్యా కువలయై:
కృపాధారా ధారా కిమపి మధురా భోగవతికా,
అవంతీ దృష్టి, స్తే బహునగర విస్తారవిజయా
ధృవం తత్తన్నామవ్యపహరణయోగ్యా విజయతే ....
( భావము )
ఓ,జననీ!నీ చూపు విశాలయై,కల్యాణియై, కువలయ ప్రస్ఫుట కాంతి కలిగి అయోధ్యయై,
కృపాధారలకు ఆధారమవుతూ ధారయై అవ్యక్త మధురమవుతూ మధురయై, అభోగవతి అవుతూ
భోగవతియై, ఆశ్రిత రక్షకమై అవంతియై, అయోఙ్ఙ్వుల అవుతూ విజయయై ఆయా నగరాల
నామాలచే వ్యవహరించదగినదై సర్వోత్కర్షతో వర్తిస్తొంది. ( విశాల మొదలు విజయ
వరకు ఎనిమిది నగరాలున్నవి. అలాగే వనితాజన సామాన్యాలయిన ఎనిమిది
చూపులున్నవి. శ్రీదేవిలో ఇవి సంక్షోభణము, ఆకర్షణము, ద్రావణము, ఉన్మాదనము,
వశ్యము, ఉఛ్ఛాటనము, ఉద్వేషణము, మారణము కల్గించునవి.) ...
( 50వ. శ్లోకము )
కవీనాం సంధర్భస్తబక మకరందై కరసికం
కటాక్షవ్యాక్షేప భ్రమరకలభౌ కర్ణయుగళం
అముఞ్చింతౌ దృష్ట్వా తవ నవరసాస్వాదతరళౌ
అసూయాసంసర్గా దలికనయనం కిఞ్చిదరుణం ...
( భావము )
అమ్మా, ఓ భగవతీ! కవీశ్వరులు రసవంతంగా రచించిన కావ్యాలను పుష్పగుచ్ఛంలోని
మకరందాన్ని గ్రోలటంలో ఎంతో మక్కువ గలదైన నీ వీనుల జంటను చూసి, నీ కడగంటి
చూపులను తుమ్మెదలు ఆమకరందాన్ని గ్రోలటంలో అత్యంతాసక్తిగలవై, ఆకర్ణయుగళాన్ని
విడువకపోవటాన్ని చూసి, పైభాగంలోఉన్న నీ ఫాలనేత్రం అసూయతో కినుక వహించినదై,
ఇంచుక కెంపువన్నె గలదై ఒప్పుతోంది...
( 51వ. శ్లోకము )
శివే శృజ్గారార్ధ్రా తదితరజనే కుత్సనపరా
సరోషా గజ్గాయాం గిరిశచరితే విస్మయవతీ ,
హరాహిభ్యో భీతా సరసిరుహ సౌభాగ్యజననీ
సఖీషు స్మేరా తే మయి జనని దృష్టిస్సకరుణా ...
( భావము )
ఓ తల్లీ! నీ దృష్టి నీ పతి సదాశివుడిపట్ల శృంగారరసం వెదజల్లేదీ ,
శివుడికంటె ఇతరులైన వారిపట్ల ఏవగింపు కలదీ , సవతి ఐన గంగాదేవి పట్ల రోషం
వహించినదీ, శివుడియొక్క చరితనువిని విస్మయాన్నొందేదీ, శంభుడి ఆభరణాలైన
సర్పములపట్ల భీతిగొన్నదీ, కమలాలకు సౌభాగ్యాన్ని ప్రసాదించేది ,చెలులకు
వికాసాన్ని కలిగించేది అయి నాపట్ల కరుణాభరితంగా ఒప్పుతోంది .దేవి దృష్టి
నవరసభరితమని భావం.జగన్మాత నేత్రసౌందర్యం ఇంకా ఇలా వర్ణించబడింది.. . ..
( 51వ. శ్లోకము )
శివే శృజ్గారార్ధ్రా తదితరజనే కుత్సనపరా
సరోషా గజ్గాయాం గిరిశచరితే విస్మయవతీ ,
హరాహిభ్యో భీతా సరసిరుహ సౌభాగ్యజననీ
సఖీషు స్మేరా తే మయి జనని దృష్టిస్సకరుణా ...
( భావము )
ఓ తల్లీ! నీ దృష్టి నీ పతి సదాశివుడిపట్ల శృంగారరసం వెదజల్లేదీ ,
శివుడికంటె ఇతరులైన వారిపట్ల ఏవగింపు కలదీ , సవతి ఐన గంగాదేవి పట్ల రోషం
వహించినదీ, శివుడియొక్క చరితనువిని విస్మయాన్నొందేదీ, శంభుడి ఆభరణాలైన
సర్పములపట్ల భీతిగొన్నదీ, కమలాలకు సౌభాగ్యాన్ని ప్రసాదించేది ,చెలులకు
వికాసాన్ని కలిగించేది అయి నాపట్ల కరుణాభరితంగా ఒప్పుతోంది .దేవి దృష్టి
నవరసభరితమని భావం.జగన్మాత నేత్రసౌందర్యం ఇంకా ఇలా వర్ణించబడింది.. . ..
( 52వ. శ్లోకము )
గతే కర్ణాభ్యర్ణం గరుత ఇవ పక్ష్యాణి దధతీ
పురాం భేత్తు శ్చిత్తప్రశమరస విద్రావణఫలే,
ఇమే నేత్రే గోత్రాధరపతి కులోత్తంస కలికే
తనాకర్ణాకృష్ణ స్మరశరవిలాసం కలయత:
( భావము )
పర్వతాలకు రాజైన హిమవంతుడి వంశమునే శిగకు పూవు మొగ్గ అయిన దేవీ ,
ధ్యానసమయంలో నా హృదయకమలంలో ప్రత్యక్షమై చూపట్టుతూన్న నీయొక్క నేత్రాలు,
ఈకలతో కూర్చిన శరాలను పోలిన రెప్ప వెంట్రుకలతో అలరారుతూ, చెవులవరకు
విస్తరించినవై పరమ శివుడి చిత్ర ప్రశాంతతను భంగపరచటమే లక్ష్యంగాగలవై చెవి
కొసలవరకు లాగబడిన మన్మధుడి బాణాలయొక్క సొబగును తలదన్నుతున్నవా అన్నట్లు
ఒప్పుచున్నవి.. ..
( 53వ. శ్లోకము )
విభక్తత్రైవర్ణ్యం వ్యతికరితలీలాఞ్జనతయా
విభాతి త్వన్నేత్రత్రితయ మిద మీశానదయితే ,
పునస్స్రష్టుం దేవాన్ ద్రుహిణహరిరుద్రానుపరతాన్
రజ స్సత్వం బిభ్రత్తమ ఇతి గుణానాం త్రయమివ ....
( భావము )
ఓ భవానీ! నీ నేత్రత్రయాలు సహజ వర్ణాలైన తెలుపు , ఎరుపుతోనూ మరియు
అందంకోసం అర్ధవలయాకారంగా తీర్చినదైన కాటుక నల్లరంగుతో , ఒకేసారి
మూడువర్ణాలతో ఒప్పారుతూ , మహాప్రళయకాలంలో నీలో లీనమై పోయివున్న బ్రహ్మ
విష్ణు రుద్రులను తిరిగి సృజించడానికి సత్త్వం,రజస్సు,తమస్సు
అనేగుణత్రయాన్ని ధరించినవాటివలె ప్రకాశిస్తున్నాయి ...
( 54వ.శ్లోకము )
పవిత్రీకర్తుం న: పశుపతిపరాధీన హృదయే
దయామిత్రై ర్నేత్రై రరుణధవళ శ్యామరుచిభి:,
నద శ్శోణో గజ్గా తపనతనయేతి ధ్రువ మముం
త్రయాణాం తీర్ధానా ముపనయసి సంబేధ మనఘం ....
( భావము )
పశుపతి పరాధీనమైన హృదయం కలిగిన తల్లీ! కరుణారసంతో కూడుకొని ప్రసన్నాలై,
తెలుపు , ఎర్రటి , నల్లటి కాంతులీనుతున్న నీ కన్నులు పాపహరాలైన శోణ (
ఎర్రని ) , గంగా ( తెల్లని ), యమునా ( నల్లని ) , మూడు తీర్ధాల సంగమాన్ని
మా ముందు ఆవిష్కరింపజేస్తూ మమ్మల్ని పునీతులను చేయునవిగా
భాసిల్లుతున్నవి.ఇది నిజం...
(55వ. శ్లోకము)
నిమేషోన్మేషాభ్యాం ప్రళయ ముదయం యాతి జగతీ
తవే త్యాహు స్సంతో ధరణిధర రాజన్య తనయే
త్వదున్మేషాజ్ఙాతం జగదిద మశేషం ప్రళయత:
పరిత్రాతుం శజ్కే పరిహృతనిమేషా స్తవ దృశ: ...
( భావము )
ఓ, తల్లీ, పర్వతరాజపుత్రీ! నీవు కన్నులను మూయటం తెరవటంవల్ల ఈ జగత్తు
నశిస్తుంది, జనిస్తుంది- అని సత్పురుషులు చెబుతారు .నీవు కన్నులు తెరవటం
వలన జనించిన ఈ సర్వజగత్తు ప్రళయంలో నశించకుండేట్లు నీవు కన్నులను
రెప్పవాల్చకుండా ఎప్పుడూ తెరిచే వుంచుతావు.
( 56వ. శ్లోకము )
తవాపర్ణే కర్ణే జపనయన పైశున్య చకితా
నిలీయంతే తోయే నియత మనిమేషా శ్శఫరికా:,
ఇయంచ శ్రీ ర్భద్దచ్ఛదపుట కవాటం కువలయం
జహాతి ప్రత్యూషే నిశిచ విఘటయ్య ప్రవిశతి ...
( భావము )
ఓ అపర్ణా ! పార్వతీ! నీ చెవుల సమీపాన సదా ( కొండెములు చెప్పునట్లు ) ఉండే
నీ నయనాలు తమ రహస్యాన్ని వెల్లడిస్తవని భయపడి శఫరితల ( బేడిన చేపలు )
నీటిలో దాక్కుంటాయి. ( దేవి నేత్రాలకున్న అనిమేషత తమ కన్నులకు కూడా వుండటం
వల్ల తమచేష్టలన్నీ అమ్మ చేత గమనించబడుతున్నాయని భయం .) ఇక నీ నేత్రలక్ష్మి
రాత్రి సమయంలో కలువయందువుండి , ఉదయాన దాన్ని దళాలను మూసివచ్చి పగలంతా నీ
నేత్రాలలో వుండి రాత్రివేళ దళాల తలపులు తెరుచుకొని కలువను చేరుతోంది . (
అమ్మవి పూర్తిగా విచ్చుకున్న పద్మాలతో సరిపోల్చతగ్గ నేత్రాలు అని భావము )
....
( 57వ. శ్లోకము )
దృశా ద్రాఘీయస్యా దరదళితనీలోత్పల రుచా
దవీయాంసం దీనం స్నపయ కృపయా మా మపి శివే !
అనే నాయం ధన్యో భవతి నచతే హాని రియతా
వనేవా హర్మ్యేవా సమకరనిపాతో హిమకర:.....
( భావము )
ఓ తల్లీ! పార్వతీ! ఎంతో నిడుదయై, కొద్దిగా వికసించిన నల్లకలువ కాంతి వంటి
నీ కడగంటి చూపును, భక్తిహీనుడైన నీ సన్నిధికి అతిదూరంలో ఉన్న నాపై దయతో
ప్రసరించు. దీనివల్లనేను ధన్యుడనవుతాను. ఇంతమాత్రాన నీకు ఏ కొరతా ఏర్పడదు
తల్లీ. చల్లని కిరణాలు గలవాడైన చంద్రుడు అరణ్యంలోనైనా , రాజప్రసాదంపైనైనా
తన కిరణాలను సమానంగానే ప్రసరింప చేస్తాడు కదా !
( 58వ.శ్లోకము )
అరాళం తే పాళీయుగళ మగరాజన్యతనయే!
న కేషా మాధత్తే కుసుమశరకోదణ్డ కుతుకం ,
తిరశ్చీనో యత్ర శ్రవణపథ ముల్లజ్ఘ్య విలసన్
అపాజ్గవ్యాసజ్గో దిశతి శరసంధానదిషణాం .....
( భావము )
ఓ శైలరాజ తనయా ! నీ కణతలు ( చెవులకు కన్నులకు నడిమ ప్రదేశం ) మన్మథుడి
పుష్పబాణ కోదండ సౌభాగ్యంగా ఎవరికి కనిపింపవు. ఎందుకంటే నీ కడగంటి చూపుల
ప్రకాశం, కనుకొనలను దాటి కణతలమీదుగా చెవులను సమీపించినదా అన్నట్లు వుండి,
వింటి నారిపై సంధించిన బాణాన్ని తలలింపజేస్తుంది. (అమ్మ అపాంగ వీక్షణాలు
పుష్పబాణాల్లా శొభిల్లి చెవులవైపుకు విస్తరించడంతో కణత ప్రదేశం కొద్దిగా
వంగి మన్మథుడి విల్లును తలపింపజేస్తుంది.) ...
( 59వ. శ్లోకము )
స్ఫురద్గణ్డాభోగ ప్రతిఫలిత తాటజ్కయుగళం
చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మథరథం ,
యమారుహ్యద్రుహ్య త్యవనిరథ మర్కేందుచరణం
మహావీరో మార: ప్రమథపతయే సుజ్జితవతే ....
( భావము )
ఓ మాతా! భగవతీ! అద్దం మాదిరి నిగనిగ మెరుస్తున్న నీ విశాలమైన చెక్కిళ్ళు
రతనాల కమ్మల జంటలీనుతున్న కాంతులతో మెరుస్తూ, నీ ముఖారవిందాన్ని మన్మథుడి
రథంలా తలపింపజేస్తున్నాయి. నీ నెమ్మొగమనే తేరును అధిష్టించిఆప్రభావం చేత
వీరత్వాన్ని పొందినవాడై మన్మథుడు, సూర్యచంద్రులు చక్రాలుగాగల భూమి అనే
రథాన్ని అధిరోహించి త్రిపురాంతకుడితో యుద్దానికి సిద్దమవుతున్న రుద్రుని
బాధించ పూనుకున్నాడు. ( అమ్మ ముఖారవిందము ఈ చరాచర ప్రపంచంలో మనకు
గోచరమయ్యే శక్తులన్నింటికన్నా గొప్పదని భావము.)
( 60వ. శ్లోకము )
సరస్వత్యా స్సూక్తీ రమృతలహరీ కౌశలహరీ:
పిబంత్యా శ్శర్వాణీ శ్రవణచుళుకాభ్యా మవిరళం,
చమత్కార శ్లాఖా చలితశిరస: కుణ్డలగణో
ఝణత్కారై స్తారై: ప్రతివచన మాచష్ట ఇన తే ....
( భావము )
ఓ పార్వతీ ! అమృత ప్రవాహము , తీయదనాన్ని యింపును హరించేవైన నీ మధుర
వచనాలను తన వీనులతో నిరంతరం గ్రోలుచున్నదై సరస్వతీదేవి, నీ చత్కారాలను
శ్లాఘిస్తున్నట్లు శిరస్సును ఊపటంవలన ఆమె కర్ణకుండలాలు కదలి
ఝణాత్కారాలతో నీకు ప్రతివచనమిస్తున్నట్లుంది...
( 61వ. శ్లోకము )
అసౌ నాసావంశ స్తుహినగిరివంశ ధ్వజపటి
త్వదీయో నేదీయ: ఫలతు ఫలమస్మాక ముచితం ,
వహత్యంత ర్ముక్తా శ్శిశిరకర నిశ్వాస గణితం
సమృద్ధ్యా యత్తాసాం బహిరపి స ముక్తామణిధర: ...
( భావము )
హిమవంతుడి వంశానికి పతాకవంటి ఓ తల్లీ ! నీ నాసావంశమునందు ముత్యాలు
ఉన్నవనటానికి సందేహములేదు. ఎందుకంటే నాసికలోపల ముత్యాలు లేకుంటే శ్వాస
వదలేటప్పుడు ముత్యమెందుకు వెలువడుతుంది? ( అని రూపకాలంకారంతో చమత్కారం )
శ్రీదేవి వామనాశికపై ధరించే ముక్తామణి అలా వెలువడినదని , ఇదే దాన్లో
ముత్యాలున్నవని చెప్పటానికి ఆధారం. ( అని చమత్కారం) అని ఆచార్యుల భావన. ఈ
నాసాదండం నావారికీ,నాకూ కోరికలను నెరవేర్చుగాక!...
(62వ.శ్లోకము )
ప్రకృత్యా రక్తాయా స్తవ సుదతి దంతచ్ఛదరుచే:
ప్రవక్ష్యే సాదృశ్యం జనయతు ఫలం విద్ర్మలతా,
న బింబం తత్బింబ ప్రతిఫలనరాగా దరుణితం
తులా మధ్యారోధుం కథమివ న లజ్జేత కలయా ....
( భావము )
ఓ మాతా! చక్కని పలువరసగల దేవీ! సహజంగా కెంపులు తేలుతున్న నీ పెదవులు
సొబగుకు సరైన పోలికను చక్కగా వక్కాణిస్తాను.పగడపు తీగెకు పండు పండుతే
ఆవిద్రుమఫలం నీ పెదవుల కాంతికి సాటి అవుతుంది. కేవలం పగడపు తీగె సాటి
కాలేదు. బింబఫలమంటె నీ అధర బింబ ప్రతిబింబ కాంతుల వలన ఎరుపెక్కింది. అట్టి
బింబఫలం నీ అధరచ్ఛాయ కళతో సైతం సరిపోల్చుకోవటానికి ఎలా సిగ్గుపడకుండ
వుంటుంది.
( 63వ శ్లోకము )
స్మితజ్యోత్స్నాజాలం తవ వదనచంద్రస్య పిబతాం
చకోరాణామాసీ దతిరసతయా చఞ్చుజడిమా,
అతస్తే శీతాంశో రమృతలహరీ మాంలరుచయ:
పిబంతి స్వఛ్ఛందం నిశి నిశి భృశం కాఞ్ఙిక థియా ...
( భావము )
అమ్మా! ఓ భగవతీ, అతిమధురమైన నీ ముఖచంద్రబింబ మందహాస వెన్నెలను గ్రోలుచున్న
చకోరపక్షుల నాలుకలు మొద్దుబారినవైనవి. అందువల్ల తమ జిహ్వలు తిరిగి రుచిని
పొందుటకై అవి ప్రతిరాత్రి ఇస్టానుసారం , చంద్రుడి అమృతపు వెల్లువను
అన్నపుగింజ అనే భ్రాంతితో త్రాగుచున్నవి...
(64వ.శ్లోకము )
అవిశ్రాంతం పత్యు ర్గుణగణకథా మ్రేడనజపా
జపాపుష్పచ్ఛాయా తవ జనని జిహ్వా జయతి సా ,
యదగ్రాసీనాయా: స్ఫటిక దృషదచ్ఛచ్ఛవిమయీ
సరస్వత్యా మూర్తి: పరిణమతి మాణిక్యవపుషా ....
( భావము )
ఓ మాతా! ప్రశస్తివహించిన నీ జిహ్వ , పతి ఐన సదాశివుడి త్రిపుర విజయాదులను
గుణగణాలను నిరంతరం వల్లించటమే జపంగా గలదై, దాసాని పువ్వు కెంజాయకు దీటైన
కాంతితో ప్రకాశిస్తొంది . స్పటిక మణి వంటి తెల్లని కాంతులను వెదజల్లుతూన్న
శరీరంతో , నీ జిహ్వాగ్రంలో సుఖాసీనయై నెలకొన్న సరస్వతీదేవి ,నీ ఎర్రని
నాలుక కాంతి సోకి తన స్వరూపం రక్తవంతమై మాణిక్యవర్ణాన్ని పొందుతున్నట్లు
గాంచుతుంది....
( 65వ.శ్లోకము )
రణే జిత్వా దైత్యా నపహృతశిరస్త్రై: కవచిభి:
నివృస్తై శ్చఞ్డాంశత్రిపురహర నిర్మాల్యవిముఖై:
విశాఖేంద్రో పేంద్రై శ్శశివిశద కర్పూరశకలా
విలీయంతే మాత స్తవ వదన తాంబూల కబళా: ..
( భావము )
తల్లీ! సంగ్రామంలో రాక్షసులను జయించి, తమ తలపాగలను తీసివేసి కవచాలు
ధరించిన వారై, రణరంగం నుంచి మరలివస్తూ చండీశ్వరుడిచే అనుభవింపదగినదని
త్రిపురహరుడైన శివుడి నిర్మాల్యము గ్రహించనోపనివారై, కుమారస్వామి విష్ణు
దేవేంద్రులు ; ఓమాత,చంద్రుడివలె స్వచ్ఛములై , నిర్మలమైన పచ్చకర్పూరపు
తునకలు గలవైన నీ నోటినుంచి వెలువడి వచ్చిన తాంబూలపు కబళాలను పూర్తిగా
గ్రహిస్తున్నారు.....
( 66వ.శ్లోకము )
విపఞ్చ్యా గాయంతీ వివిధమపదానం పురరిపో
స్త్వయారబ్ధే వక్తుం చలిత శిరసా సాధువచనే ,
తదీయై ర్మాధుర్యై రపలపిత తంత్రీకలరవాం
నిజాం వీణాం వాణీ నిచుళయతి చోళేన నిభృతం ....
( భావము )
తల్లీ! సరస్వతీదేవి వీణను శృతిచేసి నీ ఎదుట పశుపతి వీరగాధలను గానం
చేస్తూంటె నువ్వు ఆనందం పొంది , ఆమెపాటను మెచ్చుకుంటూ ప్రశంసా వాక్యాలు
చెబుతుంటె , నీ వాజ్మాధుర్యం తన వీణానాదంకంటె మాధుర్యం కలదని తెలిసి ఆమె
తనవీణను కనపడకుండా వస్త్రంతో కప్పి దాస్తుంది.
(67వ.శ్లోకము )
కరాగ్రేణ స్పృష్టం తుహినగిరిణా వత్సలతయా
గిరీశే నోదస్తం ముహురధర పానాకులతయా ,
కరగ్రాహ్యం శంభో ర్ముఖముకుర వృంతం గిరిసుతే
కధంకారం బ్రూమ స్తవ చుబుక మౌపమ్యరహితం ....
( భావము )
ఓ హిమగిరి తనయా! తండ్రి ఐన హిమవంతుడిచే అమిత వాత్సల్యంతో మునివేళ్ళతో
పుడుకబడినదీ, కైలాసపతిచేత అధరపానమునందలి, అకులత్వం చేత మాటమాటకి
తొట్రుపడుతూ పైకెత్తబడినదీ, నీ ముఖ దర్పణాన్ని వీక్షించుటకు శంభుడికి
చేతిలో పిడీ ఐన నీ చుబుకాన్ని , ఏమని వర్ణించగలను....
( 68వ. శ్లోకము )
భుజాశ్లేషా న్నిత్యం పురదమయితు: కణ్టకపతీ
తవ గ్రీవా ధత్తే ముఖకమలనాళశ్రియ మియం,
స్వత శ్శ్వేతా కాలాగరు బహుళజంబాలమలినా
మృణాళీ లాలిత్యం వహతి యదధో హారలతికా ...
( భావము )
ఓ భగవతీ ! నీ యీ కంఠం , త్రిపురాంతకుడైన శివుడి బాహువుల కౌగిలింతచే
గగుర్పాటు నొందినదై, ముఖపద్మానికి నాళం వంటిదవుతుంది. నీ కంఠానికి కింది
భాగాన సొంపారుతూ స్వభావసిద్దంగానే తెల్లనైన , స్వచ్ఛమైన నీ ముత్యాల కంఠహారం
, నల్ల అగరుగంధం వలన నీలివన్నెశోభను పొంది, నీటిలోని తామరతూడు
చక్కదనాన్ని పొందుతున్నది...
( 69వ. శ్లోకము )
గళే రేజ్ఖాస్తిస్రో గతిగమకగీతైక నిపుణే
వివాహావ్యానధ్ధప్రగుణ గుణసజ్ఖ్యా ప్రతిభువ:,
విరాజంతే నానావిధ మధుర రాగాకరభువాం
త్రయాణాం గ్రామాణాం స్థితినియమ సీమాన ఇవ తే ....
( భావము)
ఓ సంగీతమార్గ స్వరగాన నిపుణీ ! నీ కంఠంలోని మూడు భాగ్యరేఖలు వివాహ సమయాన
శంభుడు కట్టిన బహుతంతు నిర్మిత సూత్రాలను ఙ్ఞప్తికి తెస్తూ, నానావిధాలై,
మధురాలైన రాగాలకు నివాసాలయిన షడ్జగ్రామ , మధ్యగ్రామ, గాంధారగ్రామాల, ఉనికి
యొక్క నియమం నిమిత్తం ఏర్పరచిన సరిహద్దుగా ప్రకాశిస్తున్నవి.
(70వ.శ్లోకము )
మృణాళీమృద్వీనాం తవ భుజలతానాం చతసృణా
చతుర్భి స్సౌదర్యం సరసిజభవ స్స్తౌతి వదనై:,
నఖేభ్య స్సంత్రస్యన్ ప్రథమ మథనాదందకరిపో
శ్చతుర్ణాం శీర్షాణాం సమ మభయహస్తార్పణధియా ...
( భావము )
ఓ భగవతీ !తామరతూడవలె మృదువైన నీ నాలుగు భుజాల చక్కదనాన్ని గాంచి,
నరసిజభవుడు (బ్రహ్మ ) నాలుగు మోములతో , పూర్వం తన ఐదవ శిరస్సును గోటితో
గిల్లివేసిన శివుడి నఖమువల్ల భయపడుతున్న వాడవుతూ , ఒక్కసారిగా
తామరతూడులవంటి నీ నాలుగు హస్తాల లాలిత్యాన్ని స్తుతిస్తూ నిన్ను అభయదానం
చేయమని వేడుకుంటున్నాను..
( 71వ. శ్లోకము )
నఖానా ముద్యోతై ర్నవనళినరాగం విహసతాం
కరాణాం తే కాంతిం కథయ కథయామ: కథ ముమే ,
కయాచిద్వా సామ్యం భజతు కలయా హస్త కమలం
యది క్రీడ ల్లక్ష్మీచరణ తలలాక్షారసచరణం
( భావము )
ఓ పార్వతీ! సూర్యోయకాలంలో వికసించిన కొత్త తామరపువ్వు కెంజాయను
పరిహాసంచేస్తూన్న గోళ్ళకాంతి సమూహంచే విలసిల్లే నీ హస్తాల శోభాసౌందర్యాని ,
ఏ రీతి అలంకార శోభితంగా వర్ణించగలం ? కమలం ఏదో ఒకనాడు , క్రీడిస్తున్న
లక్ష్మీదేవి చరణాల లత్తుక రసమంటిన దయితే , అప్పుడు కొంత నీ కరాల
కాంతిలేశానికి సాదృశ్యం కాగలుగుతుందేమొ.!
( 72వ.శ్లోకము )
సమం దేవి స్కందద్విప వదనపీతం స్తనయుగం
త వేదం న: ఖేదం హరతు సతతం ప్రస్నుతముఖం ,
య దాలోక్యా శజ్కాకులితహృదయో హాసజనక:
స్వకుంభౌ హేరంభ: పరిమృశతి హస్తేన ఝడితి ..
( భావము )
ఓ భగవతీ ! నీస్తనములయిక్క స్తన్యపానం చేస్తూన్న వినాయకుడు తన తల్లి
స్తనములు చూసినంతనే తన తలమీద కుంభములు ఇక్కడకు వచ్చినయేమో అనే సంశయచిత్తుడై
తన కుంభస్తలాలను తడివి చూసుకొంటూ , పార్వతీ పరమేశ్వరులకు , కుమారస్వామికి
నవ్వు తెప్పిస్తాడు. ఏ స్తనద్వయం గణపతి, కుమారస్వాములచేత, పానం చేయబడినదో ఆ
స్తనద్వయం మా క్లేశాలను తొలగించుగాక.
( 73వ. శ్లోకము )
అ మూతే వక్షోజా వమృతరస మాణిక్యకుతుపౌ
న సందేహస్పందో నగపతిపతాకే మనసి న:
పిబంతౌ తౌ యస్మా దవిదితవధూ సజ్గరసికౌ
కుమారా వద్యాపి ద్విరద వదనక్రౌఞ్చదళనౌ...
( భావము )
హిమవంతుడు వంశమనే ధ్వజానికి పతాక ఐన ఓ పార్వతీ! వినాయకుడూ కుమారస్వామీ
వివాహంలేక యౌవనసుఖాలు అనుభవించక సదాకుమారులై ఉండటానికి కారణం శ్రీదేవి
స్తనాలు అమృతంతో నిండిన మణికుప్పెలు కావటం . అమృతపు కుప్పెలు కాబట్టే అమృతం
త్రావుతూ వారు సదా బాలురుగా (బ్రహ్మచర్యవ్రతంతో )వుండి స్త్రీ సంగాన్ని
త్యజించారు ...
( 74వ. శ్లోకము )
వహ త్యంబ స్తంబేరమదనుజ కుంభ ప్రకృతిభి:
సమారబ్ధాం ముక్తామణిభిరమలాం హారలతికాం ,
కుచాభోగో బింబాధరరుచిభి రంత శ్శబలితాం
ప్రతాపవ్యామిశ్రాం పురదమయితు: కీర్తిమివ తే ....
( భావము )
అంబా! పరమేశ్వరుడు గజాసురుణ్ణి సమ్హరించి అతగాడి కుంభస్థలం నుంచి తెచ్చిన
కర్పూరసమమైన ముత్యాలహారం నీ కుచమండలాన అలంకారంగా నెలకొని , దొండపండువంటి నీ
అధరబింబం యొక్క ఎర్రని కాంతులచేత పలువన్నెలచే పురదమనుడి (శివుడి)
కీర్తిని ప్రతాపాన్ని ధరించినట్లున్నది.
( 75వ.శ్లోకము )
తవస్తన్యం మన్యే ధరణిధరకన్యే హృదయత:
పయ:పారావార: పరివహతి సారస్వత మివ ,
దయావత్యాదత్తం ద్రమిళశిశు రాస్వాద్య తవ యత్
కవీనాం ప్రౌఢానా మజని కమనీయ: కవయితా ....
( భావము )
ఓ పర్వతపుత్రీ! నీ చనుబాలను నీ హృదయమ్నుంచి పుట్టి పొరలివచ్చే
పాలసముద్రంగా లేక అమృతధారల రూపమైన సర్వకళా విరాజితమైన సారస్వతంగా తలచుతాను
.కాకపోతే అమితప్రేమతో నీవిచ్చిన చనుబాలను త్రావి ఈ ద్రవిడజాతిలో జన్మించిన
బాలుడు ( శ్రీ శంకరుడు )ప్రౌఢులైన కవీశ్వరులలోకెల్ల మిగుల రమణీయంగా కవిత్వం
చెప్పే కవిగా ఎలా విరాజిల్లగలడు ?
(76వ.శ్లోకము)
హరక్రోధజ్వాలావళిభి రవలీడేన వపుషా
గభీరే తే నాభీసరసి కృతసజ్గో మనసిజ:,
సముత్తస్థౌ తస్మా దచలతనయే ధూమలతికా
జనస్తాం జానీతే తవ జనని రోమావళి రితి
( భావము )
ఓ పార్వతీ ! హరుని క్రోధాగ్ని జ్వాలలచే ఆవృతమైన శరీరంతో మన్మధుడు
లోతైన పొక్కిలి అనే నీ నాభిసరస్సులో దూకి శరీరాన్ని రక్షించుకొన్నాడు.
ఆసమయంలో నీ నాభిసరస్సునుంచి , నిప్పుకలు చల్లారటం వల్ల జనించిన పొగనే లోకం
నీ నూగారుగా తెలుసుకొంటోంది...
( 77వ.శ్లోకము )
యదే తత్కాళిందీ తను తరతరజ్గాకృతిశివే
కృశే మధ్యే కిఞ్చిజ్జనని తవ యధ్బాతి సుధియాం
విమర్ధా దన్యోన్యం కుచకలశయో రంతరగతం
తనూభూతం వ్యోమ ప్రవిశదివ నాభిం కుహరిణీం ..
( భావము )
ఓ భగవతీ! యమునానదీ తరంగంవలె సన్ననిదై నీ కృశమధ్యంలో అగపడే నూగారనే
చిన్నవస్తువును చూసి యోచించగా - నీ కుచముల మధ్యనున్న ఆకాశం ఆకుచములురెండు
పరస్పరం ఒరయటం వల్ల ఆఒరపిడికి తాళలేక నలిగినల్లనై సన్నగా కిందికి నాభివరకు
లక్క జారినట్లు జారినదిగా వున్నది...
( 78వ.శ్లోకము )
స్థిరో గజ్గావర్త: స్తనముకుళ రోమావళిలతా
కలావాలం కుణ్డం కుసుమ శరతేజో హుతభుజ:
రితేర్లీలాగారం కిమపి తవ నాభి ర్గిరిసుతే
బిలద్వారం సిద్ధే ర్గిరిశ నయనానాం విజయతే ....
( భావము )
ఓ హిమగిరికన్యకా ! నీ నాభి చలనంలేని గంగానది నీటి సుడిగాను , పాలిండ్లనే
పూమొగ్గలకు ఆధారమైన రోమరాజి అనే తీగయొక్క పాదుగాను , మన్మధుడి తేజస్సనే
అగ్నికి హోమకుండంగాను , మరుని చెలువ ఐన రతీదేవికి శృంగారభవనంగాను , నీ పతి
ఐన సదాశివుడి నయనాల తపస్సిధ్ధికి గుహాద్వారమై , అనిర్వాచ్యమై , అతిసుందరమై
సర్వోత్కర్షతో ప్రకాశిస్తొంది ...
(79వ.శ్లోకము )
నిసర్గక్షీణస్య స్తనతటభరేణ క్లమజుషో
నమన్మూర్తే ర్నారీతిలక శనకైస్త్రుట్యత ఇవ,
చిరం తే మధ్యస్య త్రుటితతటినీతీర తరుణా
సమావస్థా స్ధేమ్నో భవతు కుశలం శైలతనయే ....
( భావము )
ఓ శైలతనయా ! ఓ నారీ తిలకమా ! సన్ననిదీ , పాలిండ్ల భారంచేత బడలినదీ
క్రిందకువంగి తెగుతున్నదో అన్నట్లున్నదీ , కట్టతెగిన ఏటిగట్టునందలి
చెట్టుతో సమానమైన స్ధితిని పొందినదీ , ఐన నీ నడుము చిరకాలం సురక్షితంగా
వుండుగాక ...
( 80వ. శ్లోకము )
కుచౌ సధ్య స్స్విద్య త్తటఘటిత కూర్పాసభిదురౌ
కషంతౌ దోర్మూలే కనకకలశాభౌ కలయతా
తవ త్రాతుం భంగా దలమితి వలగ్నం తనుభువా
త్రిధా నద్దం దేవి త్రివళి లవలీవల్లిభిరివ ...
( భావము )
ఓ ప్రకాశించే రూపుగల దేవీ! ఎప్పటికప్పుడే చెమట పోస్తున్న పార్శ్వాలలో
అంటుకొనివున్న రవికెను పిగుల్చుచున్నవీ , బాహుమూలల సమీప ప్రదేశాలను
ఒరయుచున్నవీ , బంగారుకలశంవలె ఒప్పారుచున్నవీ ఐన కుచములను నిర్మిస్తూన్న
మన్మధుడు, యీ (స్తనభారంవల్ల ) భంగంకలుగరాదని నడుమును కాపాడటానికి
అడవిలతలచేత ముప్పేటగా కట్టబడెనా అన్నట్లు నీ పొట్టమీద మూడుముడతలు
తోచుతున్నాయి..
( 81వ.శ్లోకము )
గురుత్వం విస్తారం క్షితిధరపతి: పార్వతి నిజాత్
నితంబా దాచ్ఛిద్య త్వయి హరణ రూపేణ నిధతే ,
అతస్తే విస్తీర్ణో గురురయ మశేషాం వసుమతీం
నితంబ ప్రాగ్భార స్థ్పగయతి లఘుత్వం నయతిచ ....
( భావము )
ఓ తల్లీ ! శైలజా! నీ జనకుడు హిమవంతుడు తన నితంబ ( కొండ నడుమ పైనున్న
చదునైన ) ప్రదేశం నుంచి గొప్పబరువును , వైశాల్యాన్ని గ్రహించి నీకు ఆరణగా (
వివాహసమయంలో తండ్రి కుమార్తెకు ఇచ్చే కానుక) ఇచ్చాడు. కాబట్టే నీ పెరుగుదల
ఘనత బరువై, విశాలమై, ఈ భూమండలాన్నంతా కప్పుతూ తనబరువుచే భూమిని తేలికైన
దాన్నిగా చేస్తున్నది.దీన్లో సందేహం లేదు....
( 82వ.శ్లోకము )
కరీంద్రాణాం శుణ్దాన్ కనక కదళీ కాణ్డపటలీం
ఉభభ్యా మూరుభ్యా ముభయమపి నిర్జిత్య భవతి.
సువృత్తాభ్యాం పత్యు: ప్రణతి కఠినాభ్యాం గిరిసుతే
విధిజ్ఞే భానుభ్యాం విభుధకరికుంభద్వయమసి ..
( భావము )
ఓ హిమగిరిపుత్రీ! వేదార్ధవిధి నెరిగి అనుష్ఠించే రాణీ, నీ ఊరుపులు అందంలో
గజరాజాల తొండములను ,బంగారు అరటిస్థంభాల సముదాయములను ధిక్కరిస్తున్నవి. నీ
రెండు ఊరుపులు ( తొడల) చేత జయించి , శోభనములై వర్తులములు కలిగినవీ భర్త ఐన
పరమేశ్వరుడికి మొక్కటంచేత గట్టిపడినవైన నీ జానువులు , దిగ్గజాల
కుంభస్థలముల జంటలను కూడ జయించి ప్రకాశిస్తున్నాయి.( ఈ బ్రహ్మాండమే అమ్మ
స్వరూపమైనప్పుడు సృష్టిలోని ఏ శరీరం ఆమె సౌందర్యంతో తులతూగ గలదు ?
తులతూగలేదు అని భావము...
( 83వ. శ్లోకము )
పరాజేతుం రుద్రం ద్విగుణశరగర్భౌ గిరిసుతే
నిషజ్గౌ జజ్ఘే తే విషమవిశిఖో బాఢమకృత ,
యదగ్రే దృశ్యంతే దశ శరఫలా: పాదయుగళీ
నఖాగ్ర చ్ఛద్మాన స్సురమకుటశాణైకనిశితా: ......
( భావము )
ఓ హిమగిరిసుతా! మన్మధుడు రుద్రుణ్ణి ఓడించటానికి తన ఐదుబాణాలు చాలవని
వాటిని పదిబాణాలు చేసుకోనెంచి , నీ పిక్కలను అమ్ముల పొదలుగాను
,కాలివ్రేళ్ళను బాణాలుగాను , నఖాగ్రాలను బాణాల కొనలందు పదనుబెట్టి ఉంచిన
ఉక్కుముక్కలుగాను గావించుకొన్నాడు .( నమస్కరిస్తూన్న దేవతల కిరీటాలలోని
మణులనే ఒరపిడి రాళ్ళచే నఖాగ్రాలనే ములుకులు పదను పెట్టబడినవి)
(84వ.శ్లోకము)
శ్రుతీనాం మూర్ధానో దధతి తవ యో శేఖరతయా
మమాప్యేతౌ మాత శ్శిరసిదయ ధేహి చరణౌ,
యయో: పాద్యం పాథ: పశుపతి జటాజూటతటినీ
యయో ర్లాక్షాలక్ష్మీ రరుణహరి చూడామణి రుచి: ...
(భావము)
ఓ లోకమాతా ! ఏ నీ చరణాలకు శివుడి జటాజూటంలో వర్తించే గంగ పాదప్రక్షాళన జలం
అవుతుందో , ఏ నీ చరణలత్తుక రసంపు కాంతికెంజాయలు శ్రీ మహావిష్ణువు మణిమయ
కిరీటానికి వెలుగును ఆపాదిస్తున్నాయో , శ్రుతులశిరస్సులైన ఉపనిషత్తులు ఏ నీ
పదాలను సిగపువ్వుగా ధరిస్తున్నవో, ఓ మాతా! కృపతో కూడిన చిత్తంగల దానవైన
నీవు , ఆ నీ చరణాలను నాశిరస్సుమీద కూడా ఉంచు...
( 85వ శ్లోకము )
నమోవాకం బ్రూమో నయనరమణీయాయ పదయో:
త వాస్మై ద్వంద్వాయ ష్ఫుటరుచిరసాలక్తకవతే ,|
అసూయత్యత్యంతం యదభిహనయనా స్పృహయతే
పశూనామీశాన: ప్రమదవనకజ్కేళితరవే ||
( భావము )
ఓ భగవతీ! లత్తుక రసంచే తడిసి కెంపుగొన్నదై , చూచువారి కనుదమ్ములకు మిగుల
సొంపు నింపు గొలిపేదై చక్కగా వెలుగొందుతున్న నీ పాదద్వయానికి
నమస్కరిస్తున్నాం. పశుపతి ఐన శివుడు ఏనీ పాదపద్మ తాడనాన్ని కోరుతూ , ఆతాడన
భాగ్యానికి నోచుకునే అలరుల తోటలోని అశోకవృక్షాన్ని గాంచి దానిపై
అసూయపడుతున్నాడో అట్టి నీ చరణారవిందాలకు నమస్కరిస్తున్నాను.
( 86వ శ్లోకము )
మృషా కృత్వా గోత్రస్ఖలన మథ వైలక్ష్యసమితం
లలాటే భర్తారం చరణకమలే తాడయతి తే ,|
చిరా దంత శ్శల్యం దహనకృత మున్మూలితవతా
తులాకోటిక్వాణై: కిలికిలితమీశానరిపుణా ||
( భావము )
తల్లీ! పొరపాటుగా నీదగ్గర సవతి పేరు జెప్పి తరువాత ఏమీ చేయటానికి తోచక
వెలవెలబాటుచే లొంగిన భర్తను , నీ చరణకమంలంతో నుదుట తాడనం జరుపగా గాంచి
శివుడికి శత్రువైన మన్మధుడు ( ఇలాగైనా తనపగ తీరేట్లు శాస్తి జరిగిందని ) నీ
కాలి అందెల మ్రోతలచేత కిలకిలారావాన్ని గావించారు.. ...
(87వ.శ్లోకము )
హిమానీహంతవ్యం హిమగిరి నివాసైక చతురౌ
నిశాయాం నిద్రాణాం నిశి చరమభాగే చ విశదౌ
వరం లక్ష్మీపాత్రం శ్రియమతిసృజంతౌ సమయినాం
సరోజం త్వత్పాదౌ జనని జయత శ్చిత్ర మిహ కిం .....
( భావము )
ఓ జననీ! మంచుకొండలలో సైతం కుచించుకు పోకుండా ఉండగలిగేవీ రాత్రీ పగలు
వికసిస్తూ నీ భక్తులకు అనూన సంపదలను కలిగించేవీ ఐన నీ పాద కమలాలతో ,మంచుచేత
నశింపజేయదగినదీ లక్ష్మీదేవికి అలవాలమై రాత్రివేళలో ముడుచుకొని పోయేదీ ఐన
సామాన్య కమలం ఏవిధంగానూ సరితూగదని చెప్పడంలో ఆశ్చర్యం ఏమున్నది ?
ఏమీలేదు...
( 88వ. శ్లోకము )
పదం తే కీర్తీనాం ప్రపద మపదం దేవి విపదాం
కథం నీతం సద్భి: కఠినకమఠీకర్పరతులాం ,
కథంవా పాణిభ్యా ముపయమనకాలే పురభిదా
యదాదాయ న్యస్తం దృషది దయమానేన మనసా ....
( భావము )
ఓ దేవీ , భగవతీ ! అన్ని వైభవాలకూ ఉనికిపట్టై, ఆపదలను తొలగించే నీ
పాదాగ్రాలను సత్కవులు అతికఠినమైన తాబేటి చిప్పతో సరిపోల్చ ఎలా
పూనుకొంటున్నారు? త్రిపురాంతకుడైన పరమశివుడు వివాహసమయంలో కనికరంగల మానసుడై
ఎంత సున్నితంగా ఆపాదాలను సన్నెకల్లు పై పెట్టాడో కదా!
(89వ.శ్లోకము )
నఖైర్నాకస్త్రీణాం కరకమలసజ్కోచశశిభి
స్తరూణాం దివ్యానాం హసత ఇవ తే చణ్డి చరణౌ ,
ఫలాని స్వస్థ్సేభ్య: కిసలయకరాగ్రేణ దదతాం
దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిశ మహ్నాయ దదతౌ ....
( భావము )
చండీ నామంతో శోభిల్లే తల్లీ ! నీ పాదాలు, సకలసంపదలతో తులతూగుతున్న దేవతలకు
మాత్రమే కోరికలు తీర్చే కల్పవృక్షాన్ని తలదన్నుతూ , దీనజనులకు మంగళకరమైన
అధిక సంపదలను ఒసగుతున్నాయి .నీ గోళ్ళు దేవతాస్త్రీల కరపద్మాలను
ముకుళింపజేసే చంద్రుడిలా శోభిల్లుతున్నాయి...
( 90 వ.శ్లోకము )
దదానే దేనేభ్య: శ్రీయమనిశ మాశానుసదృశీ
మమంధం సౌందర్యప్రకర మకరందం వికిరతి ,
తవాస్మిన్ మమందార స్తబక సుభగే యాతు చరణే
నిమజ్జ న్మజ్జీవ: కర చరణ ష్షట్చరణ తాం ....
( భావము )
అమ్మా ఓ భగవతీ ! మందార పుష్పగుచ్ఛమనదగ్గ నీ దివ్య చరణాలు లావణ్య
మకరందాలను ఒలకబోస్తూ దీనులకు సర్వసంపదలను ఒసగుతున్నాయి . నా
ప్రాణేంద్రియాలు ఆరు పాదాల భ్రమరమై నీ పాద పుష్పజనిత పూదేనియను గ్రోలుటయందు
నిరంతరం నిమగ్నమగుగాక!...
( 91వ. శ్లోకము )
పదన్యాసక్రీడా పరిచయమివారబ్దుమనస:
స్ఖలంతస్తే ఖేలం భవనకలహంసా న జహతి,
అతస్తేషాం శిక్షాం సుభగమణిమఞ్జీర రణిత
చ్ఛలా దాచక్షాణం చరణకమలం చారుచరితే ....
( భావము )
ఓ చారుచరితా ! నీ అద్భుత గమనవిన్యాసాన్ని గాంచి నడక నేర్చుకోదలచినవై, నీ
పెంపుడు హంసలు తొట్రుపాటు చెందుతూ నీ గమన విలాసాన్ని వీడకున్నవి. అందువల్ల
నీ పాదకమలం కెంపులు మొదలగు రత్నాలు తాపిన అందియ మ్రోతలనే నెపంతో ,
ఆరాజహంసకు ఖేలన శిక్షను గరుపుతున్నట్లుగా ఉన్నది..
(92వ. శ్లోకము )
గతాస్తే మఞ్చత్వం ద్రుహిణహరిరుద్రేశ్వరభృత:
శివ స్స్వచ్ఛచ్ఛాయాకపటఘటిత ప్రచ్ఛదపట:,
త్వదీయానాం భాసాం ప్రతిఫల నరాగారుణతయా
శరీరీ శృజ్గారో రస ఇవ దృశాం దోగ్ది కుతుకం ...
( భావము )
హే భగవతీ ! బ్రహ్మ,విష్ణువు, రుద్రుడు, ఈశ్వరుడు అనే అదికార పురుషులు
నలుగురు మహేశ్వరతత్వంలో అంతర్గతులైనవారు కాబట్టి నువ్వు అధిష్టించే
మంచముయొక్క నాలుగు కోడులై వున్నారు. సదాశివుడు విమలకాంతి ఘటనారూపం వ్యాజాన
దుప్పటమగుతూ , నీ మేనికాంతులు ప్రతిఫలించటంచేత ఎర్రబారిమూర్తిమంతమైన
శృంగారరసంవలె నయనాలకు ఆనందాన్ని ఇస్తున్నాడు. ( తెల్లని కాంతిగల శివుడు
దేవి మేని ఎర్రని కాంతులు ప్రతిఫలించగా ఎర్రనివాడై ఆమెను సేవిస్తున్నాడని
భావము.. .
( 93వ.శ్లోకము )
ఆరాళా కేశేషు ప్రకృతిసరళా మందహసితే
శిరీషాభా చిత్తే దృషదుపలశోభా ( దషదివకఠోరా )కుచతటే
భృశం తన్వీ మధ్యే పృథూరసిజారోహవిషయే
జగత్త్రాతుం శంభో ర్జయతి కరుణా కాచిదరుణా ....
( భావము)
తల్లీ ! శంభుడి అనిర్వాచ్యమైన అరాళా అనేశక్తి నీ కురులలో ప్రకాశిస్తోంది.
చిరునవ్వులో నీదు సహజమైన సరళా అనేశక్తి ప్రకాశిస్తూంది. చిత్తంలో
దిరిసెన పువ్వులాగా మిక్కిలి మెత్తనైన శక్తి ప్రకాశిస్తోంది. స్తనప్రదేశంలో
సన్నికల్లు శోభగల శక్తి ప్రకాశిస్తోంది. పిరుదులలో స్థూలశక్తి
ప్రకాశిస్తూంది. దేవి జగత్తును రక్షించటానికి అరుణ అనే శక్తీ, కరుణ అనే
శక్తీ భాసిల్లుతున్నాయి. ...
( 94వ.శ్లోకము )
కళజ్క: కస్తూరీ రజనికరబింబం జలమయం
కళాభి: కర్పూరై ర్మరకతకరణ్డం నిబిడితం ,
అతస్త్వద్భో గేన ప్రతిదిన మిదం రిక్తకుహరం
విధి ర్భూయోభూయో నిబిడయతి నూనం తవకృతే ....
( భావము )
మాతా! లోకంలోని జనులు అఙ్ఞానంతో దేన్ని చంద్రమండలమని తలచుతున్నారో ,
నిజానికది మరకత మణులచే చేయబడి నీవు కస్తూరి మొదలైన వస్తువులు ఉంచుకోనే భరిణ
,చంద్రుడి కలంకంగా భావించబడుచున్నది . నువ్వు ఉపయోగించే కస్తూరి దేన్ని
చంద్రుడనుకుంటున్నారో అది నువ్వు జలకమాడే పన్నీరు నింపిన కుప్పె. చద్రకళలని
భావించబడుతున్నవి పచ్చకప్పురపు ఖండాలు .నీవు ఉపయోగించటం వలన తరుగుతున్న ఈ
వస్తువులను నీదు సేవకుడైన బ్రహ్నమరల నింపుతున్నాడు..
( 95వ.శ్లోకము )
పురారాతే రంత:పురమసి తతస్త్వచ్చరణయో
స్సపర్యామర్యాదా తరళకరణానా మసులభా ,
తథా హ్యేతే నీతా శ్శతమఖముఖా స్సిద్ధి మతులాం
తవ ద్వారోపాంతస్థితిభి రణిమాద్యాభి రమణా
( భావము )
తల్లీ! భగవతీ! నువ్వు శివుడి పట్టపుదేవి వవుతావు. అందువల్ల నిన్ను
పూజించే భాగ్యం చపలచిత్తులైన వారికి లభించదు. ఇంద్రుడు మొదలైన దేవతలు నీ
ద్వారాల చెంత అణిమాది అష్టసిద్దులతోపాటు కావలి కాస్తున్నారు. ( చంచల
చిత్తులుకాని సమయాచారులకే శ్రీ దేవి పాదాంబుజ సేవ లభిస్తుంది. .
ఇంద్రాదులకు సైతం అష్టసిద్దులు లభిస్తాయి కానీ అమ్మపాదసేవాభాగ్యము
లభించదని భావము...)
( 96వ.శ్లోకము.)
కళత్రం వైధాత్రం కతికతి భజంతే న కవయ:
శ్రియో దేవ్యా: కోవా న భవతి పతి: కైరపి ధనై:
మహాదేవం హిత్వా తవ సతి సతీనామ చరమే
కుచాభ్యా మాసజ్గ: కురవకతరో రప్యసులభ:
( భావము )
ఓ సతీమతల్లీ ! ఎందరెందరు కవులు సరస్వతీదేవిని భజించి ఆమె కృపకు
పాత్రులవడంలేదు.? శ్రీదేవిని ప్రార్ధించి ఎందరు ఆమెకటాక్షం వల్ల
లక్ష్మీపతులవడంలేదు? ఓ పతివ్రతలలో అగ్రగణ్యా ! మహాశివుణ్ణి వీడి నీ
హృదయాన్ని దోచుకోవడం , కురవక తరువునకు ( గోరంట చెట్టు ) సైతం లభ్యం కాదు
గదా ! కవి సరస్వతీపతి అవుతాడు.ధనికుడు లక్ష్మీపతి అవుతాడు. పార్వతీపతి
మాత్రం మహా దేవుడొక్కడే. ఆమె పాతివ్రత్యం అవాజ్మానసగోచరం అని భావము....
( 97వ.శ్లోకము )
గిరా మహుర్దేవీం ద్రుహిణగృహిణీ మాగమవిదో
హరే: పత్నీం పద్మాం హరసహచరీ మద్రితనయాం
తురీయా కాపి త్వం దురధిగమనిస్సీమమహిమా
మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మమహిషి ...
(భావము )
ఓ పరబ్రహ్మ పట్టపుదేవీ! ఆగమవిధులు నిన్నే బ్రహ్మ పత్నివైన సరస్వతి
అంటారు. .నిన్నే శ్రీహరి పత్ని లక్ష్మి అంటారు. నిన్నే హరుని సహచరి ఐన
గిరితనయ అంటారు. కానీ నువ్వు ఈమువ్వురికంటే వేరై నాల్గవదేవియై
ఇట్టిదట్టిదని వచింపనలవిగాని ఆమెవై అనిర్వాచ్యవై, దేశ కాల వస్తువులకు
అపరిచ్ఛిన్నమై, భేదించరాని మహాప్రభావం కలిగినదానవై, శుద్దవిద్యలో
అంతర్గతమైన మహామాయవై, మాయాతత్త్వమవుతూ ఈ ప్రపంచాన్ని నానా విధాలుగా
మోహపెట్టుతున్నావు.. .
( 98వ.శ్లోకము )
కదా కాలే మాత: కథయ కలితాలక్తకరసం
పిబేయం విద్యార్ధీ తవ చరణ నిర్ణేజనజలం ,
ప్రకృత్యా మూకానా మపి చ కవితా కారణతయా
కదా దత్తే వాణీ ముఖ కమల తాంబూల రసతాం .........
( భావము )
అమ్మ! లత్తుక రసంతో కలిసిన నీ పాద ప్రక్షాళన జలాన్ని విద్యార్ధినైన నేను
ఎప్పుడు గ్రోలతానో చెప్పు.. సరస్వతీ మోము తారలోని తాంబూలరసమనదగ్గ నీ పాద
ప్రక్షాళిత జల మూగవారికి సైతం కవిత్వరచనా సౌభాగ్యాన్ని ప్రసాదించగలదు. ఆ
లక్తకరసం నాకు ఎప్పుడు ప్రసాదిస్తావో గదా! నీ పాద ప్రక్షాళిత జలాన్ని నాకు
ప్రసాదించి నాముఖం నుండి కవితా సుధారస ధారలను ఎప్పుడు ప్రవహింపజేస్తావో
గదా!అని భావము..
( 99వ.శ్లోకము )
సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్నో విహరతే
రతే: పాతివ్రత్యం శిధిలయతి రమ్యేణ వపుషా
చిరం జీవన్నేవ క్షపిత పశుపాశ వ్యతికర:
పరానందాభిఖ్యం రసయతిరసం త్వద్భజనవాన్ .....
( భావము )
అమ్మా ఓ భగవతీ ! నిన్ను ఉపాసించేవారు , సరస్వతీ దేవినీ (సర్వవిద్యలను)
లక్ష్మీదేవినీ ( సర్వసంపదలను ) పొంది వాళ్ళభర్తలైన బ్రహ్మవిష్ణువులకు
వైరిగా మారుతున్నారు .రమ్య శరీరంచే రతీదేవిని సైతం ఆకర్షించి ఆమె
పాతివ్రత్యానికి భంగం కలిగిస్తున్నాడు. పశుతుల్య శరీరాన్ని
తొలగించ్గుకుఒని , జీవన్ముక్తుడై కేవలం సదాశివ తత్త్వాత్ముడై పరానంద
సుఖాన్ని ఆస్వాదిస్తున్నాడు...
( 100వ.శ్లోకము )
ప్రదీపజ్వాలాభి ర్ధివసకరనీరాజనవిధి:
సుధాసూతో శ్చంద్రోపలజలలవై రర్ఘ్యరచనా ,
స్వకీయైరంభోభి స్సలిలనిధి సౌహిత్యకరణం,
త్వదీయాభి ర్వాగ్భి స్తవ జనని వాచాం స్తుతిరియం
( భావము )
ఓ భగవతీ!స్వకీయాలైన చేతి దివిటీల జ్వాలలచేత సూర్యుడికి ఆరతి
గావిస్తూన్నట్లు చంద్రకాంత శిలనుండి శ్రవిస్తూన్న జలబిందువులచేత
చంద్రుడికి ఆర్ఘం సమర్పిస్తూన్నట్లూ, ఉదకాలచే సముద్రుడికి తృప్తికారణమైన
తర్పణం కావిస్తూన్నట్లూ , నీ వల్ల పొడిమినటువంటి నీ స్వరూపాలైన వాక్కుల
కూర్పులచే నిన్ను నేను స్తుతిస్తున్నాను.